అలా చెప్పుకునేందుకు సిగ్గులేదా బాబూ..?

  • చంద్రబాబుది వివక్షాపూరితమైన పాలన
  • కృష్ణాడెల్టా రైతాంగానికి తీరని అన్యాయం చేశారు
విజయవాడః నేనొచ్చాకే కృష్ణా డెల్టాకు నీరొచ్చిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో కృష్ణా డెల్టా రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. 1996 నుంచి 2003 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు సముద్రంలోకి నీరు వృథాగా పోతున్నా, ఇవాళ కరువుతో రైతాంగం అల్లాడుతున్న పట్టించుకోని చంద్రబాబు...కృష్ణా-గోదావరి డెల్టాను తానే సృష్టించానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడారు. 

పోలవరానికి ప్రతిపక్షం అడ్డుపడుతోందంటూ చంద్రబాబు మాట్లాడడంపై పార్థసారధి ఫైర్ అయ్యారు. ఆనాడు దేవినేని ఉమ పాదయాత్ర చేసి వైయస్ఆర్ రాయలసీమకు నీళ్లు తీసుకుపోతన్నాడని ప్రచారం చేయలేదా..? మీ వర్గానికి చెందిన రైతాంగాన్ని రెచ్చగొట్టి కోర్టులో కేసులు వేయించి, వైయస్ఆర్ చేపట్టిన కాలువలు తవ్వకుండా అడ్డుపడింది మీరు కాదా..? అని నిలదీశారు. ఆనాడు వైయస్ఆర్ తవ్వించిన కాలువలోంచి ఇవాళ మీరు నీళ్లు తీసుకొస్తూ తామే చేసినట్టు చెప్పుకోవడం దుర్మార్గమన్నారు.  భూ సేకరణలో రైతులు బ్రహ్మాండంగా భూములిచ్చారని చంద్రబాబు చెప్పుకోవడంపై పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.   మీ వర్గం, పార్టీకి సంబంధించిన రైతాంగానికి ఓ ధర...బడుగులు, పేద రైతాంగానికి ఓ ధర నిర్ణయించే వివక్షాపూరిత పాలన చంద్రబాబుదని దుయ్యబట్టారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడ కృష్ణా డెల్టా మోడరైజేషన్ కు సంబంధించి గంపెడు మట్టిగానీ, కాంక్రీటు గానీ వేసిన పాపాన పోలేదన్నారు. ఆనాడు అన్ని రాజకీయ పక్షాలు డొనేషన్స్ పోగుచేసుకొని పులిచింతల కట్టాలన్న ఆలోచన చేశారన్న సంగతి బాబు తెలుసుకోవాలన్నారు. పులిచింతల ప్రాజెక్ట్  కృష్ణా డెల్టా రైతాంగానికి ఆయువుపట్టులాంటిదని గుర్తు చేశారు. పులిచింతలలో  40 టీఎంసీలు స్టోర్ చేసుకునేందుకు అవకాశమున్నా కూడ బాబు ఆ పని చేయడం లేదని పార్థసారధి దుయ్యబట్టారు.  మీకు ముడుపులు లభించలేదనే  ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదా..? అని నిలదీశారు. 
Back to Top