రైతుల కోసం బాబు కేంద్రంతో ఎందుకు పోరాడలేదు?




– నాలుగేళ్లుగా మద్దతు ధరలు నామమాత్రంగా పెరిగాయి
– వైయస్‌ఆర్‌ హయాంలోనే మద్దతు ధరలు పెరిగాయి
– వైయస్‌ఆర్‌ హయాంలోనే రైతులు సంతోషంగా ఉన్నారు
– వైయస్‌ఆర్‌సీపీ రైతులకు అండగా ఉంటుంది
విజయవాడ: రైతుల కోసం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు పోరాటం చేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు ముష్టి వేసినట్లుగా ఉన్నాయని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు సుభీక్షంగా ఉండేవారని గుర్తు చేశారు. మహానేత పాలనలోనే మద్దతు ధరలు పెరిగాయని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.550 నుంచి రూ.1000 వరకు మద్దతు ధర పెరిగిందన్నారు. 81 శాతం ధాన్యానికి మద్దతు ధర పెరిగిందని చెప్పారు. అప్పుడే రుణమాఫీ వచ్చిందని, ఎరువుల ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదని చెప్పారు. డీజీల్, ఆయిల్‌ ధరలు కంట్రోల్‌లో ఉన్నాయన్నారు. మహానేత పాలనలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ అందిందని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మించి అప్పట్లో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మంచి ధరలు వచ్చాయన్నారు. అందుకే ప్రజలు ఇప్పటికీ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుకు చేసుకుంటున్నారని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ–2 ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ధాన్యం మద్దతు ధర రూ.1000 నుంచి రూ.1300లకు పెరిగిందన్నారు.  29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్రాన్ని ఏం అడిగారని నిలదీశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాటు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆయనకు వ్యవసాయం పట్టదని విమర్శించారు. నాలుగేళ్లుగా ధాన్యానికి కేవలం 12 శాతం మాత్రమే పెరిగిందన్నారు. పత్తికి 8 శాతం, వేరుశనగకు 2.5 శాతం, కంది, మినుముకు మాత్రం 26 శాతం మద్దతు ధర పెరిగిందన్నారు. మొక్కజొన్న 8 శాతం మాత్రమే పెరిగిందన్నారు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని కేంద్రం ఇప్పుడు ధాన్యానికి రూ.200 మద్దతు ధర పెంచారన్నారు. యూపీఏ–1లో 31 శాతం పెరిగితే ఈ నాలుగేళ్లలో ధాన్యానికి 33 శాతం మాత్రమే మద్దతు ధర పెంచారన్నారు. రాష్ట్రంలో పెరిగిన డీజిల్‌ ధరలు, ఎరువుల ధరల కారణంగా ధాన్యానికి కనీసం రూ.2 వేలు మద్దతు ధర లేకపోతే రైతులు వ్యవసాయం చేయలేరన్నారు. క్వింటాల్‌ ధాన్యానికి కనీసం రూ.2 వేలు మద్దతు ధర ప్రకటించాలని వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి డిమాండు చేస్తుందన్నారు. వేరుశనగ పంటకు కూడా గత నాలుగేళ్లలో 11 శాతం పెంచారని, ఇప్పుడు రూ.440 పెంచారన్నారు. రైతులకు ముష్టి వేసినట్లు కేంద్రం మద్దతు ధరలు పెంచితే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వైయస్‌ జగన్‌ సీఎం కాగానే వ్యవసాయానికి పెద్ద పీట వేస్తారని చెప్పారు.
 
Back to Top