ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది

చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి
సంఘీభావ పాదయాత్ర ముగింపులో వైయస్‌ఆర్‌ సీపీ నేత మల్ల విజయప్రసాద్‌
విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మూడ్రోజులుగా సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. సంఘీభావ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మల్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలను బాధిస్తూ, పీడిస్తూ ప్రజా అవసరాలను తీర్చకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. దుర్మార్గపు పాలన సాగిస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కొండవాగు ప్రాంత ప్రజలకు 24 గంటలు నీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 90 కోట్లతో గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జేఎన్‌ఎంఆర్‌యూలో వాటర్‌ ప్రాజెక్టు తీసుకొస్తే ఈ రోజు అది ఏమైందని ప్రశ్నించారు. తాగు, సాగునీరు అందించకుండా ప్రాజెక్టుల పేరుచెప్పుకొని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తూ 3000 కిలోమీటర్లు పూర్తి చేశారన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అధికారంలోకి రాగానే వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. వైయస్‌ జగన్‌ను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. 
Back to Top