అశోక్‌గజపతిరాజు సంతకాల సేకరణ హాస్యాస్పదం

జిల్లా హామీలను విస్మరించి.. కడప ఉక్కు కోసం పోరాడుతారా?
టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయి.. చరమగీతం త్వరలోనే
విజయనగరం: ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయని అశోక్‌ గజపతిరాజు కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయడం హాస్యాస్పదమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతిరాజు విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు. విజయనగరం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివరసిటీ గిరిజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించడం లేదా అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, నాలుగేళ్లయినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. దీనిపై ఎందుకు అశోక్‌గజపతిరాజు పోరాటం చేయడం లేదని నిలదీశారు. విభజన చట్టంలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాలు సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమపై పోరాడే అర్హత లేదన్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్లుగా అశోక్‌ గజపతిరాజు వైఖరి ఉందన్నారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. 
Back to Top