బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్న మంత్రి సుజయ

డీసీసీబీ పాలక వర్గం రద్దు చేయడంలో ఆంతర్యమేంటీ?
విజయనగరం: మంత్రి సుజయకృష్ణరంగారావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీసీలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డీసీసీబీల కాల పరిమితి పెంచి నాలిగింటికి మాత్రమే ప్రత్యేక అధికారులను నియమించడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన మహిళ ఉండడంతోనే మంత్రి పాలక వర్గాన్ని రద్దు చేయించారని శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లా సహకార సంఘ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందన్నారు. ప్రజాస్వామ్యం మీద మంత్రి సుజయకృష్ణ రంగారావుకు గౌరవం లేదన్నారు. మంత్రి పదవికి ఆశపడి బీఫాం ఇచ్చి గెలిపించిన పార్టీని వీడి టీడీపీలో చేరారని మండిపడ్డారు. అడ్డదారిలో వచ్చిన పదవిని అనుభవిస్తూ చేతులో అధికారంలో ఉందనే అహంతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏ సామాజికవర్గ ఓట్లు దండుకుని అధికారం చెలాయిస్తున్నారో.. ఆ సామాజిక వర్గాలపై కన్నుకుట్టి మహిళ అని చూడకుండా చైర్మన్‌ పదవి నుంచి తొలగించడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. దీన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. 
 
Back to Top