అధైర్యపడొద్దు అండగా ఉంటాం

అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ ధైర్యం
ప్రతీ రూపాయి ఇప్పించే వరకు పోరాడుతాం
అప్పులు తీర్చకుండా ఆస్తులు కాజేయాలనే ప్రభుత్వ దురాలోచన
అమర్‌సింగ్, సీతారాంలతో ఏయే ఒప్పందాలు కుదుర్చుకున్నారో చెప్పాలి
బాధితులను సమావేశమైన అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ
విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏ ఒక్కరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఐదు రాష్ట్రాలకు చెందిన అగ్రిగోల్డ్‌ బాధితులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి, జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ ఆస్తులను అప్పనంగా కొట్టేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ. 11 వందల కోట్లు చెల్లిస్తే 80 శాతం మందికి ఉపశమనం కలుగుతుందని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సార్లు చెప్పినా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. 

ఆస్తులను కొనుగోలు చేసి బాధితులను రూపాయితో సహా అప్పు చెల్లిస్తామని ముందుకు వచ్చిన జీఎస్‌ఎల్‌ సంస్థ ఎందుకు వెనక్కు తగ్గిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో సీబీసీఐడీ, మంత్రులు అగ్రిగోల్డ్‌ ఆస్తులు అప్పులకంటే అనేక రెట్లు ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. మరి జీఎస్‌ఎల్‌ సంస్థ ఎందుకు వెనక్కు తగ్గిందని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద బ్రోకర్‌గా చెప్పుకునే అమర్‌సింగ్, కేసులో ముద్దాయిగా ఉన్న సీతారాంలు ఏప్రిల్‌ 3వ తేదీన అర్ధరాత్రి ఆంధ్రాభవన్‌ చంద్రబాబును కలిశారన్నారు. మరుసటి రోజే ఎస్‌ఎల్‌ సంస్థ ఆస్తులు కొనుగోలు చేయలేమని కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు. రహస్యభేటీలో ఆస్తులు కాజేయడానికి ఏఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబులో లేదని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఎంతసేపటికీ ఆస్తులు ఎలా కాజేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల గుంటూరులో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఎవరూ అధైర్యపడొద్దని న్యాయం చేసేందుకు.. ప్రభుత్వంపై పోరాడేందుకు వైయస్‌ఆర్‌ సీపీ ఉందని వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. ప్రతీ రూపాయి ఇప్పించే బాధ్యత వైయస్‌ఆర్‌ సీపీదన్నారు. 
 
Back to Top