అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాం

– ఏ ఒక్కరూ బలవన్మరణాలకు పాల్పడవద్దు.. 
– చంద్రబాబు కుట్రలను కోర్టుల్లోనే తిప్పికొడతాం
– ఢిల్లీలో చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలైంది
– బాధితులను ముంచేందుకే అమర్‌సింగ్, సుభాష్‌ చందర్‌తో రహస్య భేటీలు 


గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేవరకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని.. బాధితులెవరూ తొందరపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమన్వకర్త, వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి విజ్ఙప్తి చేశారు. మొన్ననే శ్రీకాకుళంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి ఏ ఒక్కరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని.. అవసరమైతే కోర్టులో ఇంప్లీడ్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఈనెల 3న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు జీఎస్‌ఎల్‌ గ్రూపుకు చెందిన సుభాస్‌ చందర్‌జీ, మాజీ ఎంపీ అమర్‌సింగ్‌లను ఎందుకు కలిశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల నుంచి రూ. 1100 కోట్లు చెల్లిస్తే దాదాపు 70 శాతం మందికి న్యాయం జరుగుతుందని గతంలోనే ప్రభుత్వానికి చెప్పామని ఆయన  పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రూ. 10 కోట్లు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కోర్టుకెక్కడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అవసరమనుకుంటే బాధితుల పక్షాన కోర్టులో ఇంప్లీడ్‌ అవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల ఆస్తులను కొల్లగొట్టేందుకు చంద్రబాబు.. ఢిల్లీలో చీకటి మంతనాలు జరిపారని తెలిపారు. అగ్రిగోల్డ్‌ కేసుతో అమర్‌సింగ్‌కి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆధారాలతో సహా బయటపడినందుకే పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మాట్లాడారని ఆయన చెప్పారు. దమ్ముంటే ఈ భేటీ వెనుక గల కారణం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసమని బయటకు చెప్పినా చంద్రబాబు చేసింది మాత్రం ఇలాంటి చీకటి ఒప్పందాలేనని ఆయన ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మొన్నటిదాకా ఆస్తుల గురించి చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్నట్టుండి.. ఆస్తులకన్నా అప్పులే ఎక్కువయ్యాయని చెప్పడం చూస్తేనే బాధితులను ముంచడానికి కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా బొత్స సత్యనారాయణ ఆధారాలతో సహా బయటపెట్టారని తెలిపారు. 


Back to Top