వైయ‌స్ జగన్‌ పర్యటనతో టీడీపీలో వణుకు


 వైయ‌స్ఆర్‌సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి వెంకట నాగేశ్వరరావు
జన ప్రభంజనం చూసి తట్టుకోలేకపోతున్నారు
నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి  

 

పశ్చిమగోదావరి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకు నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని  పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారుమూరి మాట్లాడారు.

వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు జనస్పందన లేదని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే సొంత ఊరు వేల్పూరులో జనసందోహాన్ని చూసి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు వచ్చిన జన సందోహానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వేల్పూరులో ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి గ్రామం దాటేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టిందని గుర్తు చేశారు. నవనిర్మాణ దీక్షలకు జనస్పందన లేకపోవడం చూసి ఎమ్మెల్యే ఈ విధంగా పొరబడి ప్రజా సంకల్పయాత్రను విమర్శిస్తున్నారని చెప్పారు.

బయటకు వస్తే అవినీతి చూపిస్తా
నాలుగేళ్ల కాలంలో తణుకు నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే జరిగిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కారుమూరి డిమాండ్‌ చేశారు. తన హయాంలో అవినీతి జరగలేదని చెబుతున్న ఎమ్మెల్యే తనతో పాటు వస్తే జరిగిన అవినీతి చూపిస్తానని సవాల్‌ విసిరారు. మట్టి దోపిడీ, ఎస్సైను నిర్బంధించిన వ్యవహారం, వేల్పూరులో ఒక యువకుణ్ని కొట్టి చంపిన కేసు, వేల్పూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఉద్యోగుల నియామకంలో అవినీతి, 7.26 ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నాలు తదితర వాటిలో ఎమ్మెల్యే వ్యవహారంపై కారుమూరి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కారుమూరి అన్నారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షులు ఎస్‌ఎస్‌ రెడ్డి, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.  


తాజా వీడియోలు

Back to Top