దమ్ముంటే 'మా పులి'ని వదలండి: జూపూడి

విజయనగరం, 16 జూన్‌ 2013:

ప్రతిభ గల యోగ్యుడైన శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి మన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అభివర్ణించారు. ఆ ప్రకంపనలు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోని ఎవరి గుండెల్లో మోగుతున్నాయో తాను వివరంగా చెప్పాల్సిన అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. విజయనగరంలో ఆదివారం జరిగిన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో జూపూడి మాట్లాడారు. దమ్ము, ధైర్యం ఉంటే 'మా పులి' జగనన్నను ఒకసారి బయటికి వదలండి అని జూపూడి సవాల్‌ చేశారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు మన రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉన్నది.. వైయస్‌ఆర్ మరణించిన తరువాత ఆయన పెట్టిన కార్యక్రమాలను ఏ విధంగా నీరుగార్చారో.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన పథకాలను ఏ విధంగా కొనసాగించబోతున్నదీ క్లుప్తంగా మాట్లాడమని తనను పార్టీ నాయకత్వం ఆదేశించిందని జూపూడి చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీకి 34 సంవత్సరాలు సేవలు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని భౌతికంగా లేకుండా చేయడమే కాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా నమోదు చేసి మానసికంగా కూడా ఆయన జ్ఞాపకాలు ఉండకుండా చేస్తున్న పాలకుల తీరుపై జూపూడి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మహానేత బిడ్డగా ఆయన ఆశయాలను తాను బ్రతికిస్తానని చెప్పి శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారన్నారు. ఆ జగనన్నను కూడా ఏదో అసత్య ఆరోపణతో ప్రజల మధ్య లేకుండా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌పై చేసిన ఆరోపణలన్నీ అసత్యాలన్నారు.

కళ్ళ ముందే కన్న కొడుకుని దుర్మార్గంగా జైలులో నిర్బంధిస్తే కన్న తల్లిగా శ్రీమతి విజయమ్మ బాధ్యత తీసుకుని పార్టీ కోసం, ప్రజల కోసం రాష్ట్రం నలుమూలలా తిరుగుతున్నారని జూపూడి తెలిపారు. కొడుకంటూ ఉంటే శ్రీ జగన్‌లా ఉండాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అందరూ భావిస్తున్నారన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులతో సహా కారు చౌకగా తన బినామీలకే చంద్రబాబు అమ్మేస్తూ విధాన నిర్ణయాలు తీసుకున్నారని జూపూడి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఊడగొట్టే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారన్నారు. పల్లెల్ని శ్మశానాలుగా మార్చారన్నారు. ప్రభుత్వ డెయిరీని మూసేసి తన హెరిటేజ్‌ మాత్రమే ఉనికిలో ఉండేలా చంద్రబాబు నిర్ణయాలు చేశారని జూపూడి ఆరోపించారు. కిరణ్‌కుమార్‌ పథకాలన్నీ సర్‌చార్జీలు పెంచే పథకం, కరెంటు చార్జీలు పెంచే పథకం, ఇంధన సర్దుబాటు చేసే పథకం, మహానేత వైయస్‌ పెట్టిన ఫీజు రీయింబర్సుమెంటును తగ్గించే పథకం,‌ వంట గ్యాస్ సబ్సిడీని తీసేసే పథకంలా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డికి ప్రతి పేదవాడి గుండె బాధ తెలుసని, ప్రజల ఇబ్బందులు తెలుసు, పల్లెల్లో సమస్యలు తెలుసు అని జూపూడి ప్రస్తావించారు. అందుకే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఆ మహానేత పథకాలు రూపొందించి, విజయవంతంగా అమలు చేశారన్నారు. అందుకే ఆయనను ప్రతి ఒక్కరూ ఇంతగా గుండెల్లో నిలుపుకున్నారన్నారు. ఆ మహానేత ఆశయాలు, ఆశలను కొనసాగించే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని జూపూడి పిలుపునిచ్చారు. పంచాయతీ స్థానాల్లో 80 శాతం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుని ముందుండేలా చేయాలని విజ్ఞప్తిచేశారు. వచ్చే కాలం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అన్నారు.

తాజా వీడియోలు

Back to Top