విదేశీ పర్యటనలతో ఏం సాధించావు బాబూ?

– దావోస్‌ నుంచి లోకేష్‌ అమెరికాకు ఎందుకు వెళ్లారు?
– వరి రైతులపై దేవినేని ఉమా వ్యాఖ్యలు సిగ్గుచేటు
విజయవాడ: పెట్టుబడుల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి ఏం సాధించారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత జోగి రమేష్‌ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, అలాంటి హోదాను తాకట్టు పెట్టి పెట్టుబడుల కోసం అంటూ కాలయాపన చేయడం బాధాకరమన్నారు. దేవినేని ఉమా రైతులను సోమరిపోతులు అని విమర్శలు చేయడం సిగ్గు చేటు అని ఆయన మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తారని, చంద్రబాబు మొహం చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు వస్తారన్నారు. ప్రత్యేక హోదా కోసం వీరుడుగా, ధీరుడిగా పోరాటం చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని నిర్భందిస్తున్నావని మండిపడ్డారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎందుకు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నావని నిలదీశారు. ప్రత్యేక హోదా అవసరం లేదు..ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వేజోన్, రాజధానికి నిధులు తీసుకురాకుండా చంద్రబాబు కేంద్రం నుంచి ఏం సాధించారని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలతో ఏం సాధించావు, ఎన్ని పెట్టుబడులు సాధించావు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావో చంద్రబాబు చెప్పగలరా?అని నిలదీశారు. విశాఖలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.4 లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నారని, రెండో సమ్మిట్‌లో కూడా  ఇలాగే చేశారని, ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు.  మూడు పంటలు పండే భూములు వదలకుండా బలవంతంగా లాక్కొన్నారని, రైతులను మభ్యపెట్టేందుకు ఏరువాక అంటూ కట్టు కథలు చెబుతున్నారన్నారు. దావోస్‌ పర్యటనతో ఏం సాధించావన్నారు. మీ అబ్బాయి నేరుగా అమెరికా పర్యటనకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దావోస్‌ నుంచి అమెరికాకు ఏం తీసుకెళ్లారో సమాధానం చెప్పాలన్నారు.

ప్రత్యేక హోదా సాధించి తీరుతాం
వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక హోదా సాధిస్తామని, రాష్ట్ర ప్రజలకు తోడుగా ఉంటామని జోగి రమేష్‌ చెప్పారు.  ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని టీడీపీ గుర్తించాలన్నారు. చంద్రబాబు నీవు అవసరం లేదని బీజేపీ అసహ్యించుకుంటున్నా వారినే పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే..ఆయన కేబినెట్‌లోని మంత్రి దేవినేని ఉమా మాత్రం వరి పంట పండించే రైతులు సోమరిపోతులు అంటూ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఉమా..నీవు ఏం తిని ఇంత పెద్దవాడివి అయ్యావన్నారు. రైతులను విమర్శించేందుకు ఉమా నీచమైన స్థితికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా తన నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. మైలవరంలో టీడీపీ హయాంలో ఒక్క సెంట్‌ భూమి కొని పేదలకు పంచావంటే నిన్ను శబాష్‌ అంటామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొనుగోలు చేసిన భూములను ఉమా పంపిణీ చేసి ఫొటోలు దిగడం సిగ్గు చేటు అన్నారు. ఉమా హయాంలో పేదలకు ఒక్క సెంట్‌ భూమి కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top