నాలుగేళ్లుగా నరకయాతన చూపించిన పాలన

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
విజయవాడ: నాలుగేళ్ల చంద్రబాబు పాలన నరకాసురుడిలా ప్రజలకు నరకయాతన చూపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ విమర్శించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  నాలుగు సంవత్సరాల కాలంలో నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వం ప్రజలను రోడ్ల మీద నిలబెట్టి పెన్షన్‌ కావాలంటే దీక్షకు రావాలని వేధింపులకు గురిచేస్తోందన్నారు. చివరకు పిల్లల్ని సైతం వదల కుండా ఎండల్లో కూర్చోబెట్టి మాడ్చేస్తుందన్నారు. ఏం సాధించిందని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతుందో చెప్పాలన్నారు. రోజుకు ఒక జిల్లా తిరుగుతున్న చంద్రబాబు దీక్షకు హాజరైన అరకొర ప్రజానీకంతో చప్పట్లు కొట్టమని చెప్పి మరీ కొట్టించుకుంటున్నాడన్నారు. ఒక ముఖ్యమంత్రి ఇంత అసమర్థుడిగా మారిపోయాడంటే.. ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారన్నారు. దేశంలోనే నా అంత సీనియర్‌ నాయకుడు లేడని, 40 సంవత్సరాల అనుభవం.. అని చెప్పి ప్రజలను నట్టేట ముంచాడని మండిపడ్డారు.  
 
Back to Top