'మంత్రులు జిల్లాల్లో, యనమల ఢిల్లీలోనా'

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ టీయూసీ నేత గౌతంరెడ్డి విమర్శించారు. కార్మికుల సమస్యలు, సామాన్యుల కష్టాలు గాలికి వదిలేసిందని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. కార్మికుల సమ్యలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం చేస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని గౌతంరెడ్డి అన్నారు. సమస్యను గాలికి వదిలేసి మంత్రులు శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడులు సొంత జిల్లాల్లో తిరుగుతున్నారని, ఇక కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన సమస్యను పట్టించుకోకుండా జిల్లాల్లో పర్యటిస్తున్నారని గౌతంరెడ్డి అన్నారు. విమానాల ఇంధన చార్జీలలు తగ్గించిన ప్రభుత్వం ఆర్టీసీపై మాత్రం ఇంధన ఛార్జీల భారం మోపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని గౌతంరెడ్డి సూచించారు.
Back to Top