అన్నం పెట్టే మహిళలపై ఇంత దారుణమా

 
– మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అరెస్టు దుర్మార్గం
– 85 వేల మంది కార్మికులను తొలగించడం దారుణం
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మిడ్‌ డే మిల్‌ కార్మికులకు రూ.10 వేల వేతనం

విజయవాడ: విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టే కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం బాధాకరమని  వైయస్‌ఆర్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మిడ్‌ డే మీల్‌ కార్మికులను జలియన్‌వాలాబాగ్‌ తరహాలో పాశవికంగా అరెస్టు చేశారని, 85 వేల మందిని తొలగించడం దారుణమన్నారు. విజయవాడలోని అన్ని పోలీసు స్టేషన్లు మహిళలతో నిండిపోయాయని, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ప్రయత్నం దుర్మార్గమన్నారు. కార్మికులంటే చంద్రబాబుకు మొదటి నుంచి కూడా ఏహ్యభావం ఉందన్నారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గౌతంరెడ్డి మీడియాతో మాట్లాడారు.

అన్నం పెట్టే తల్లులను అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టడం దుర్మార్గమన్నారు. పసోరాటం అంటే చంద్రబాబు ఒక్కరే చేయాలా అని నిలదీశారు. మరెవరూ పోరాటం చేయకూడదా అని నిలదీశారు. చంద్రబాబు 2014లో మారిపోయానని మేక తోలు కప్పుకొని వచ్చి ఓట్లు వేయించుకున్నారని మండిపడ్డారు. మేక తోలు కప్పుకున్నంత మాత్రాన చంద్రబాబులో ఎలాంటి మార్పు లేదన్నారు. విజయవాడలోని అలంకార్‌ సెంటర్‌లో నిత్యం ఏదో ఒక పోరాటం చేస్తుంటారని, అలాంటి స్థలంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపడితే వారిని అరెస్టు చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.

దుర్గా మాత ఆలయాంలో చీరల దొంగతనం జరగడం దారుణమన్నారు. దొంగలంతా నోరు మూసుకున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే అమ్మవారి కిరీటం దోచుకున్నారని, అందరూ ఆందోళనకు గురికావడంతో నకిలీ కిరీటం తెచ్చి పెట్టారన్నారు. ఆలయంలో క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలపై ఇంతవరకు విచారణ జరుపలేదన్నారు. అలాగే వెంకటేశ్వరస్వామి ఆలయంలో వజ్రాలు పగిలిపోయాయని చెబుతున్నారని, స్వామి వారికి నైవేద్యాలు పెట్టకుండా ఆపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మా ఎంపీ విజయసాయిరెడ్డి స్వామి వారి ఆభరణపై చేసిన సవాలును చంద్రబాబు ఎందుకు స్వీకరించలేకపోతున్నారని నిలదీశారు. దోపిడీలు, కైంకర్యాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. చీరలు దొంగతనం చేసింది దుర్గమ్మ కమయిటీ సభ్యులే అని అందరూ చెబుతుంటే, ఆ కమిటీ సభ్యులనే విచారణ చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కమిటీ సభ్యులే దొంగతనం చేశారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. డార్మెంట్రీ వద్ద, మహిళలు బట్టలు మార్చుకునే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టారని ధ్వజమెత్తారు. ఆలయంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న సిబ్బందిని వేధిస్తున్నారని తెలిపారు. 

– మధ్యాహ్న కార్మికులకు నెలకు రూ.10 వేలు ఇచ్చేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, వారి పోరాటానికి మద్దతిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఇకనైన అరెస్టుల పర్వం మానుకోవాలని కోరారు. 

 
Back to Top