బాబు పాలనలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదుమరుగుదొడ్ల నిర్మాణాల్లో కూడా జన్మభూమి కమిటీ చేతివాటం
వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఉత్తరాంధ్రకు ఉత్సాహం నింపింది

విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న మద్దతు చూస్తే ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందన్నారు. విశాఖకు చేరిన వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఉత్తరాంధ్రకు నూతన ఉత్తేజాన్ని నింపిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పెన్షన్, రేషన్, ఇల్లు ఇస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు జననేత దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే.. నిన్న అత్తిలి వరలక్ష్మీ అనే మహిళ భర్త చనిపోయి పక్షవాతంతో బాధపడుతుందని, ఆమెకు ఆన్‌లైన్‌లో మంజూరైన ఇంటిని టీడీపీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. సంక్షేమానికి పెద్దపీట ఎక్కడుందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడ చూసినా సంక్షోభం తప్ప సంక్షేమం లేదన్నారు. చెరుకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మరుగుదొడ్లు నిర్మాణాలను కూడా వదలకుండా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. బాబు చేతిలో మోసపోయిన రైతులంతా ముందుకు వచ్చి పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 
 
Back to Top