రాజధాని నిర్మాణం పేరుతో అక్ర‌మాలు


శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం అక్రమాలకు పాలుపడుతోందని  వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం సింగపూర్‌ ప్రభుత్వం చేపడుతుందా? లేక ఆ దేశ ప్రైవేట్‌ కంపెనీ చేపడుతుందా? అని ప్రశ్నించారు. సింగపూర్‌ మంత్రి ఏ హోదాలో రాజధాని నిర్మాణ సంస్థతో సంతకాలు చేశారు, ఆయన పర్యటనపై విదేశాంగ శాఖ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని పరిసర ప్రాంతాలలోని భూములు కారు చౌకగా సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం గవర్నర్‌ పేరుతో అక్రమంగా పదిహేను వందల జీవోలు విడుదల చేశారని, వీటిపై గవర్నర్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కలవనున్నదని ధర్మాన స్పష్టంచేశారు. ఈ జీవోలన్నింటిపై  కేంద్రం దృష్టి సారించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలతో ప్రజలను అపహాస్యం చేస్తుందని ఎద్దేవచేశారు.  
 


Back to Top