ప్రతి ఐటీడీఏ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు



విశాఖ: ప్రతి ఐటీడీఏ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు పార్టీ అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పేర్కొన్నారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అరకు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ అన్నారు. ఇప్పటికే 11 మంది డెంగీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అరకు ఆసుపత్రిలో ఐదుగురు డెంగీ వ్యాధితో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  మైదాన ప్రాంత గిరిజనులకు పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. అరకు నియోజకవర్గంలో ఐదు పంచాయతీలు మైదాన ప్రాంతంలో ఉన్నాయని, వీరికి  విద్యా, ఉపాధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక మెడికల్‌ కాలేజీ పెడతామని వైయస్‌ జగన్‌ హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.
 
Back to Top