అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు బాబు స్కెచ్‌

జీఎస్సెల్‌ కంపెనీ, అమర్‌సింగ్‌లతో రహస్య భేటీ
హోదా ముసుగులో చంద్రబాబు చీకటి ఒప్పందాలు
వాటాలు కుదరక కోర్టును ఆశ్రయించిన జీఎస్సెల్‌ కంపెనీ
రూ. 11 వందల కోట్లు ఇచ్చి 16 లక్షల కుటుంబాలను ఆదుకోలేరా..?
టీడీపీ అధికార ప్రతినిధిగా ప్రణాళిక సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలు
బాధితులకు అండగా ఉంటామని వైయస్‌ జగన్‌ ఆనాడే చెప్పారు
బాధితులకు అండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుంది
చంద్రబాబు సింగపూర్‌కు ఎందుకు వెళ్లారో రెండ్రోజుల్లో బయటపెడతాం
ఏయే వ్యాపారాలు చేస్తున్నారో.. అన్ని లెక్కులు ఉన్నాయి
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ముసుగులో ఢిల్లీ పర్యటనకు వెళ్లి చంద్రబాబు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని బొత్స ఎండగట్టారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోదా కోసం జాతీయ నాయకులందరినీ సమీకరిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎవరికీ తెలియకుండా మాజీ ఎంపీ అమర్‌సింగ్‌ను కలిసి రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ వేయించాలని డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
కోర్టులో ఉన్నప్పుడు మీరెందుకు కలిశారు..
ఈ నెల 3వ తేదీన రాత్రి 10 గంటలకు ఎవరికీ తెలియకుండా చంద్రబాబు అగ్రిగోల్డ్‌ను హైకోర్టులో టేకోవర్‌ చేస్తామన్న జీఎస్సెల్‌ సంస్థ యజమాని సుభాష్‌చంద్ర, మాజీ ఎంపీ అమర్‌సింగ్, వీరితో పాటు అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్రముఖ న్యాయవాది ముగ్గురితో సమావేశమయ్యారని బొత్స చెప్పారు. చంద్రబాబును కలిసిన రెండ్రోజులకే జీఎస్సెల్‌ సంస్థ యాజమాన్యం అగ్రిగోల్డ్‌ ఆస్తులు విక్రయించలేమని అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. అగ్రిగోల్డ్‌ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జీఎస్సెల్‌ కంపెనీతో మీరు ఎందుకు చర్చించారు చంద్రబాబూ అని ప్రశ్నించారు. మొదట్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయని చెప్పిన కంపెనీ ఇప్పుడు ఎందుకు రూ. 4 వేల కోట్లు అని చెబుతుందని నిలదీశారు. చీకటి ఒప్పందాల్లో వాటాలు కుదరకపోయే సరికి వారు అఫిడవిట్‌ దాఖలు చేసింది వాస్తవమా.. కాదా..? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు చెప్పకపోతే వివరాలు మేము బయటపెడతామని హెచ్చరించారు. 
కుటుంబరావు మీ పదవికి కలంకం తేవొద్దు..
ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11 వందల కోట్లు ఇచ్చి 80 శాతం అంటే దాదాపు 16 లక్షల కుటుంబాలను ఆదుకోవాలని మార్చి 17వ తేదీ 2017న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని కోరారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అనంతరం బాధితుల వద్దకు వెళ్లి రాబోయే ప్రభుత్వం మాది తప్పకుండా 80 శాతం మంది ప్రజలను ఆదుకుంటామని భరోసా ఇచ్చామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం చేస్తూ పైపెచ్చు వారికి అండగా పోరాడుతున్న వైయస్‌ఆర్‌ సీపీపై నిందలు వేస్తున్నాడని మండిపడ్డారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు బినామీలా మాట్లాడితే.. దానికి సమాధానం చెబుతామన్నారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉండి.. ప్రభుత్వానికి ఒత్తాసుగా ఉండడమేనా మీ బాధ్యత అని ప్రశ్నించారు. జీఎస్సెల్‌ సంస్థ ఎందుకు వెనుకంజ వేసిందో చెప్పాలన్నారు.
చట్టం ఒప్పుకోదా.. చంద్రబాబూ?
పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు రూ. 11 వందల కోట్లు ఇచ్చి 16 లక్షల కుటుంబాలను ఆదుకోలేరా.. అని ప్రశ్నించారు. అలా చేస్తే చట్టం ఒప్పుకోదా చంద్రబాబూ అని నిలదీశారు. హాయ్‌ల్యాండ్, విశాఖ పట్నంలోని బీచ్‌ రిసార్ట్స్, విలువైన భూములు అవన్నీ చంద్రబాబు దక్కించుకోవాలని దుర్బుద్ధితో బాధితులకు అన్యాయం చేస్తున్నాడన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను మంత్రులు అప్పనంగా కాజేశారని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ సాక్షాలతో సహా బయటపెట్టారన్నారు. వైయస్‌ జగన్‌ మాటగా అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వం మెడలు వంచైనా డబ్బు ఇప్పిస్తామన్నారు. లేదా వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 
మీ వ్యాపారాలు ఏంటో బయటపెడతాం.. 
చంద్రబాబు సింగపూర్‌కు ఎందుకు వెళ్లారో అది కూడా రెండ్రోజుల్లో బయటపెడతామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ వ్యాపారాల కోసం చంద్రబాబు వెళ్లారో.. బాబు సొంత వ్యాపారాలు ఏంటో.. అన్ని బయటకు తీసుకువస్తామన్నారు. ఇంత వరకు ఎక్కడెక్కడ దాపరికాలు చేశారో.. అన్ని లెక్కలు ఉన్నాయన్నారు. దేవుడి గుడి వెనకాల ఉండి పవిత్రుడినని చెప్పుకుంటే కుదరదని.. ప్రవర్తనను బట్టి వ్యక్తిత్వం తెలిసిపోతుందన్నారు. చీకటి ఒప్పుందాలు చేసుకుంటూ 16 లక్షల కుటుంబాలతో ఆటలాడుతారా.. వారి కష్టాలు చూసి సంబరాలు చేసుకుంటారా.. అని మండిపడ్డారు. ఇదేనా చంద్రబాబు మీ 40 సంవత్సరాల అనుభవం అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు. దోపిడీ బయట పడుతుందనే చంద్రబాబు భయపడుతున్నారన్నారు. 
16వ తేదీ బంద్‌ జయప్రదం చేయాలి..
చంద్రబాబు ప్రభుత్వ పదవికాలం ఇంకా కొంతకాలమే ఉండడంతో ఇష్టారీతిగా దోచుకోవడానికి తయారువుతుందని, రాజకీయ పక్షాలతో పాటు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని బొత్స సూచించారు. ఈ నేపథ్యంలో 16వ తేదీన ప్రత్యేక హోదా సాధన కోసం సాధన సమితి పిలుపు మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటంలో పాల్గొంటుందన్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువతను కోరారు. 
 
Back to Top