నీ అబ్బ సొత్తు పంచుతున్నావా చంద్రబాబూ?

  • రాష్ట్రానికి ఏం ఉద్ధరించావని నీకు ఓటేయాలి
  • బాబు మాట్లాడిన మాటలకు జైలుకు పంపించాలి
  • తెలంగాణలో ఓటుకు రూ. 5 కోట్లు, ఏపీలో ఓటుకు రూ. 5 వేలు
  • బాబు రాజకీయ చరిత్ర నీచాతి నీచం
  • నీ పథకాలతో లబ్ధిపొందిన వారు ఒక్కరైనా ఉన్నారా..?
  • వీధి రౌడీలు, గూండాలకన్నా హీనంగా చంద్రబాబు పాలన
  • జాతీయ జెండాకు వందనం చేయలేని సంస్కారం లోకేష్‌ది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: నా వల్ల మీరు లబ్దిపొందుతున్నారు, కాబట్టి నాకే ఓట్లు వేయాలి.. ఇతరులకు వేయడానికి వీల్లేదు అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశారు. ప్రభుత్వం నుంచి వస్తున్న కార్యక్రమాలకు మీ అబ్బసొత్తు నుంచి ధారాదత్తం చేస్తున్నారా అని బాబుపై విరుచుకుపడ్డారు. తర తరాలుగా పేరుకుపోయిన ఆస్తులను వీధి దీపాలు, రహదారులు, పెన్షన్లుగా మార్చి చారిటీ ద్వారా పంపకాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.  మహానేత వైయస్ఆర్ పరిపాలనలో చేసింది 5 శాతమైనా చేశావా బాబు..? నీ పథకాలతో ఒక్కరైనా లబ్ది పొందినవారున్నారా..? అని బాబుపై ధ్వజమెత్తారు.  ఎన్నికల్లో ఓటుకు రూ. 5 వేలు కూడా ఇవ్వగలను అని చంద్రబాబు మాట్లాడిన మాటలకు జైలుకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. రూ. 5 కోట్లతో ఎమ్మెల్సీని గెలిపించడానికి ఎమ్మెల్యేను కొనుగోలు చేశారనడానికి ఇంతకంటే ఊదారహణ ఉండదన్నారు. 

మేలు చేయమంటే రూ. లక్షల కోట్లు దోపిడీ చేస్తారా..?
తెలంగాణలో ఎమ్మెల్యేను కొనడానికి రూ. 5 కోట్లు ప్రయత్నించారు. ఈ రోజున రూ. 5 వేలతో ఓటర్లను కొనుగోలు చేయడానికి చూస్తున్నారు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఎన్నికల్లో రూ. 11.5 కోట్లు ఖర్చు చేశానని చెప్పారు.  ప్రజలంటే మీకు ఓటర్లుగా కనిపిస్తున్నారా అని భూమన ప్రశ్నించారు. టీడీపీ సర్కార్‌ ప్రజాస్వామ్య రాజకీయం అంతా అవినీతితో నిండిందన్నారు. ప్రజాస్వామ్యానికి వేరు అర్థం చంద్రస్వామ్యం అని తీసుకొచ్చారని అన్నారు. అంటే ఓట్లను కొనుగోలు చేయడం.. ప్రజలందరినీ ఓటర్లుగా చూడడమేన్నారు. వైయస్‌ఆర్‌ ప్రజలకు మేలు చేసిన కార్యక్రమాల్లో కనీసం 5 శాతం కూడా నెరవేర్చకపోవడం మూలంగా చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత పెల్లుబికిందన్నారు.  ప్రజలకు మేలు చేయాలని అధికారం ఇస్తే వారిపై పడి రూ. లక్షల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించా.. హైటెక్‌ సిటీ నా చేతుల మీదుగా ప్రారంభించా అన్న చంద్రబాబు మాటలు వింటుంటే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను అక్కడ ఉండనిచ్చేలా లేడని, బాబు మాటలతో జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు. 

నమ్మిన వారిని వంచించడమే బాబు నైజం
చంద్రబాబు గత చరిత్ర అంతా నీచ చరిత్రేనని, తనకు సహాయం చేసిన రాజకీయ పక్షాలను, వ్యక్తులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూ వారిని వంచిచడమే బాబు ధ్యేయం అని భూమన విమర్శించారు. వేదాలు చదవొద్దు.. శాస్త్రాలు చదవొద్దు అని ఆనాడు హిరణ్యకష్కుడు భక్తప్రహ్లదకు చెప్పినట్లుగా ఈ నాడు నేను చెప్పిందే వేదం.. నేను చెసిందే పాలన అన్నట్లుగా కొత్త అర్థాలు ప్రజాస్వామ్యానికి అందిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు పథకాలతో లబ్ధిపొందిన వారు ఒక్కరు కూడా లేరన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలందరినీ దోపిడీ చేసి దొంగలకంటే, బేహారులకంటే.. వీధి రౌడీలు, గుండాలకంటే హీనంగా బాబు పరిపాలన సాగిస్తున్నాడని భూమన ఆగ్రహించారు. విశాఖ నుంచి అమరావతి, కర్నూలు వరకు భూ దందాలు, ప్రజా విద్రోహ కార్యక్రమాలతో రూ. లక్షల కోట్లు దోపిడీ చేసి ఆ ధనంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

జెండాకు వందనం చేయాలని లోకేష్‌కు తెలియదా..?
చంద్రబాబు తనయుడు లోకేష్‌కు సిగ్గు, లజ్జా, దమ్మూ, ధైర్యం ఉంటే నిజాయితీ పరుడైతే భూదందాల్లో నీకు ఎలాంటి భాగస్వామ్యాలు లేకపోతే.. సీబీఐ ఎంక్వైరీకి సిద్ధం కావాలని భూమన సవాలు విసిరారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ మహాధర్నా వేదికగా లోకేష్‌ భూదందాల కనెక్షన్స్‌పై ప్రస్తావిస్తే... చర్చకు రావాలనడం విడ్డూరంగా ఉందన్నారు. నువ్వు అవినీతి చేస్తున్నావని లోకమంతా కోడై కూస్తుందని, ఇది చర్యలతో తేలే అంశం కాదని దమ్ముంటే సీబీఐ, సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణకు ఆదేశించు అని చురకంటించారు. స్టాన్ ఫోర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఏదో చదివాడని, కార్నెగీ మెక్మేలన్‌ యూనివర్సిటీ నుంచి ఏదో పట్టా పుచ్చుకున్నట్లుగా గొప్పులు చెప్పుకుంటున్న లోకేష్‌ భాష, మాటలు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఆ యూనివర్సిటీల విలువలను దిగజార్చుతున్నాడన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా లోకేష్‌ గురించి చెప్పారని, తనను అరెస్టు చేసే సమయంలో పోలీసులతో లోకేష్‌ అనేక భూతు పదాలు వాడాడని, లోకేష్‌ రూథర్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి వచ్చినట్లుగా లోకం భావిస్తుందన్నారు. చివరకు జాతీయ జెండాకు వందనం చేయాలనే విషయం కూడా లోకేష్‌కు తెలియదా అని భూమన ప్రశ్నించారు. అమెరికన్‌ యూనివర్సిటీల్లో చదువుకున్నాడు కదా.. ఆ దేశ జెండా కనిపించలేదే.. అని వందనం చేయకుండా ఉన్నట్లుగా అనిపిస్తుందన్నారు. 
Back to Top