అవసరాలకు దేవుడినీ వదలని చంద్రబాబు

బాబు పాలనలో భగవంతుడికే దిక్కులేదు
తిరుపతి వెంకన్న ఆభరణాలు ఏమయ్యాయి
కేంద్ర సమాచార కమిషనర్‌ ప్రశ్నకు సమాధానం చెప్పాలి
పచ్చరాబంధుల జేబుల్లోకి దుర్గమ్మ చీరలు, మల్లన్న మాణిక్యాలు, వెంకన్న నగలు
వేంకటేశ్వరుడిని తన కులంవాడిగా చిత్రీకించిన దుర్మార్గుడు చంద్రబాబు
నగల మాయంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి 
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి
తిరుపతి: భగవంతుడిని కూడా తన అవసరాలకు వాడుకునే అతి నేర్పరి చంద్రబాబు అని, బాబు పాలనలో మనుషులకు భక్తి విశ్వాసాలు చాటుకునే హక్కు లేదు.. దేవుడికి దిక్కులేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి నగలు, దుర్గమ్మ చీరలు, మల్లన్న మణిమాణిక్యాలు పచ్చరాబంధుల జేబుల్లోకి పలహారాలుగా మారిపోతున్నాయని ఆరోపించారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుపతి వెంకన్న ఆలయ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేంకటేశ్వరస్వామి ఆలయానికి అపచారం జరుగుతుందని, అప్రతిష్ట తెస్తున్నారని, శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన నగలు ఏమయ్యాయని కేంద్ర సమాచార కమిషనర్‌ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర సంస్కృతిక శాఖను ప్రశ్నించారన్నారు. పురావస్తు కట్టడం, పురావస్తు స్థల పరిరక్షణ చట్టంలోకి తేకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందని నిలదీశారన్నారు. 

గతంలో జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథరావు ఇచ్చిన రిపోర్టులను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని భూమన ప్రశ్నించారు. 1958వ సంవత్సరంలో వచ్చిన పురాతన కట్టడాలు, ప్రాచీన స్థలాల పరిరక్షణ చట్టం కింద 2011లో డైరెక్టర్‌ ఆఫ్‌ మ్యూజియం 20 మంది సభ్యులతో ఆలయ గోడల మీద శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన నగల రికార్డులు అన్ని రాసి పెట్టి ఉన్నాయని వారు ప్రకటించడమే కాకుండా దాన్ని పురాతన చట్టం కిందికి తేవాలని చెప్పిన ప్రతిపాదనలు ఇంకా ఎందుకు తొక్కి పెడుతున్నారని ధ్వజమెత్తారు. రమణ దీక్షితులు స్వామివారి ఆలయంలో అపచారం జరుగుతుందని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా తలనొప్పికి మందు ఇవ్వకుండా తలెందుకు నరికారని ప్రశ్నించారు. 

ఒకరోజులో గంట పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి లెక్కలు సరిగ్గా ఉన్నాయని పాలక మండలి ప్రకటించడం దారుణమన్నారు. భగవంతుడికి తరతరాలుగా వచ్చిన నగలన్నీ ప్రభుత్వ హయాంలో మాయమయ్యాయని ఆరోపణలు చేస్తుంటే ఉన్న నగలను ప్రదర్శించి ఇవే అని చెప్పి తప్పించుకోవడానికి బూటకపు ప్రకటనలు చేస్తున్నారన్నారు. 1952 నుంచి తిరువాభరణం రిజిస్టర్‌లో ఉన్న నగల గురించి మాట్లాడుతున్నామని చెబుతున్నారు. ఆలయ గోడల మీద కృష్ణదేవరాయలు ఇచ్చిన నగల వివరాలు ఉంటే వాటి గురించి ప్రస్తావనే లేదన్నారు. ఆలయంలో ప్రసిద్ధి కలిగిన క్షేత్రంలో జియ్యంగారి వ్యవస్థకు చంద్రబాబు నీరుగార్చరని మండిపడ్డారు. అర్చకుల్లో కలహాలు సృష్టించి కుటుంబాల్లో చిచ్చురేపి రమణదీక్షితులు, చంద్రబాబు తొలగించిన ఇతర అర్చకులపై ఆరోపణలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమస్తా అర్చకుల సంఖ్య పెంచేందుకు అనువంశిక అర్చకులు తలలు కొరగాలనే సాంప్రదాయానికి టీడీపీ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. 

టీడీపీ పార్లమెంట్‌ సభ్యుడు మురళీమోహన్‌ వెంకటేశ్వరుడు మా కులస్తుడే అని ప్రకటించారని,  చంద్రబాబు వెంకన్న మా కులదైవం అంటే అది దేవుడిపై ఉన్న నమ్మకం అనుకున్నాం కానీ స్వామిని తన కులంవాడిగా చిత్రీకరిస్తాడనుకోలేదన్నారు. ఈ రకమైన చేష్టలకు పాల్పడుతూ పచ్చి వ్యాపార కేంద్రంగా వెంకన్న ఆలయాన్ని మార్చివేశారని ఆరోపించారు. పుణ్యక్షేత్రంలో గతంలో చంద్రబాబు పరిపాలించిన సమయంలో.. ప్రస్తుతం పాలిస్తున్న ఈ కాలంలోనే వెంకటేశ్వరస్వామి ఆభరణాలు మాయమయ్యాయని, రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా రమణ దీక్షితులపై దాడి చేశారన్నారు. స్వామివారి నగలు ఏమయ్యాయని ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే తెలుగుదేశం రాబంధులు, చంద్రబాబు తొత్తులు వైయస్‌ఆర్‌ సీపీ నేతలపై దాడి చేసి మేమే శ్రీవారి నగలు దోపిడీ చేసినట్లు దిగజారిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను పాలక మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేవుడి నగలు మాయమయ్యాయని, అపచారాలు జరిగాయని ఆరోపణలు చేశారని భూమన గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణపై సీబీఐ ఎంక్వైరీ వేయండి అని గవర్నర్‌ను కలిసి కోరడమే కాకుండా 8 రోజుల పాటు నిరాహార దీక్ష చేశానన్నారు. ఆ దీక్షను ఆమరణదీక్ష అని ప్రకటించిన తరువాత కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరభారతీ స్వామి దీక్షా శిబిరానికి వచ్చి భూమన నిజాయితీ పరుడని చెప్పి దీక్ష విరమింపజేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పోయిన నగలు, జరుగుతున్న అరాచకాలపై సీబీఐ ఎంక్వైరీ వేయండి అని అడిగితే.. తేలుకుట్టిన దొంగలా చంద్రబాబు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక న్యాయమా..? అని నిలదీశారు.  

గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు గొల్ల మండపాన్ని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. భక్తుల భయపడి ఆ నిర్ణయాన్ని చర్చకు రానివ్వకుండా చేస్తున్నారన్నారు. వందల సంవత్సరాలుగా ఉన్న గొల్లమండపాన్ని కూల్చే కుట్ర. రమణ దీక్షితులు ఇంట్లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫొటో ఉందని ధర్మపోరాట దీక్ష సభలో బుద్ధి లేకుండా చంద్రబాబు ప్రకటన చేశారని భూమన ధ్వజమెత్తారు. అదే రమణ దీక్షితులు ఇంట్లో వైయస్‌ఆర్‌ ఫొటోతో చంద్రబాబు ఫొటో కూడా లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిద్దామని సవాలు విసిరారు. జరుగుతున్న అన్యాయాలకు సమాధానం చెప్పకుండా రమణ దీక్షితులు వ్యక్తిత్వంపై బురదజల్లుతున్నారన్నారు. 
 
గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులపై ఆరోపణలు వస్తే వెంటనే పదవులకు రాజీనామాలు చేశారని భూమన గుర్తు చేశారు. చంద్రబాబుకు సిగ్గు ఎగ్గు ఏమైనా ఉంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇతరులు అన్యమత ఆరాధకులని, ఆయనొక్కడే వేంకటేశ్వరుడి భక్తుడినని ప్రకటించుకునే చంద్రబాబు కేంద్ర సమాచార కమిషనర్‌ వేసిన ప్రశ్నలకు సమాధానంగా రాజీనామా అయినా చేయాలి. లేదా సీబీఐ చేత ఎంక్వైరీకి ఆదేశమైనా చేయాలి. సుప్రీం కోర్టు జడ్జితో విచారణకు సిద్ధపడాలన్నారు. అంతేకాని భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడే హక్కు, అర్హత లేదన్నారు. 
Back to Top