మాయ మాటలతో మభ్యపెడుతున్నారు


– వృద్ధి రేటుపై ఏపీ సర్కార్‌ అసత్యాలు ప్రచారం
– ఏపీ వ్యవసాయ రంగం దుస్థితిని నాబార్డు, నీతి అయోగ్‌ పేర్కొన్నాయి
– చంద్రబాబు, ఏపీ మంత్రులవి ఊకదంపుడు ఉపన్యాసాలే
– ఎప్పుడో ఏదో అయిపోతుందంటూ హడావుడి చేస్తున్నారు
– బాబు సర్కార్‌ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టాం
హైదరాబాద్‌: నాలుగేళ్లుగా చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందని, దేశంలోనే మన రాష్ట్రంలో వ్యవసాయం అధిక వృద్ధిరేటు సాధించిందని వృద్ధిరేటుపై చంద్రబాబు, ఆయన మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ వ్యవసాయరంగం ఉస్థితిని నాబార్డు, నీతి అయోగ్‌ సంస్థలు తమ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నాయని భూమన వివరించారు. చంద్రబాబు సర్కార్‌ తీరును అసెంబ్లీలో, ప్రజా క్షేత్రంలో ఎండగడుతూ..వాస్తవాలు ప్రజలకు  చెప్పామన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు 1995, ఆగస్టు 21వ తేదీన స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చారిత్రక దినమన్నారు. ఆ వ్యక్తి ఇంకా రాజకీయాలను శాసిస్తూ..అధికారంలోకి వచ్చేందుకు నాడు ఎలాంటి అబద్దాలు ఆడారో..వాటిని ఇంకా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.ప్రజలను వంచించి, మోసగించి పరిపాలన సాగించడం దురదృష్టకరమన్నారు. ఏపీని అభివృద్ధిలో బుల్లెట్‌ లాగా దూసుకుపోయేలా చేస్తున్నానని, తెలుగు ప్రజలు 80 శాతం మంది తన పాలనపై తృప్తిగా ఉన్నారని, నాలుగేళ్లలో వృద్ధి రేటు 15 శాతానికి మించి ఉందని, పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని, జీడీపీ పరంగా దేశ జీడిపీ కంటే రెట్టింపు స్థాయిలో దూసుకుపోతుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయంలో మైనస్‌ 2 శాతం ఉంటే, ఏపీలో 3.2 శాతమని, వృద్ధిరేటు జాతీయ స్థాయిలో 0.6 శాతం ఉంటే, ఏపీలో 7. 78 శాతం ఉందని, 2016–2017వ ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో వ్యవసాయ జీడీపీ 6.3 శాతం ఉంటే, ఏపీలో 14.91 శాతం ఉందని, 2017–2018వ సంవత్సరంలో జాతీయ స్థాయిలో 6.6 శాతం ఉంటే, ఏపీలో ఏకంగా 17.76 శాతం పెరిగిందని చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పదే పదే చెబుతున్నారని తప్పుపట్టారు. వ్యవసాయంలో పెరిగిన అద్భుతమైన వృద్ధిరేటు వల్ల ఏపీ దూసుకుపోవడంలో ఎవరికి అందనంత స్థాయిలో ఉందని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. 2022వ సంవత్సరం నాటికి ఏపీ టాప్‌ త్రీ స్టేట్స్‌లో ఒక్కటిగా ఉంటుందని, 2029 నాటికి దేశంలోనే అగ్రగామీ రాష్ట్రంగా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఏపీ తయారవుతుందని ప్రతి రోజు చంద్రబాబు చెప్పడం..మనం వింటూనే ఉన్నామని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పింది నిజమే ..కానీ అది తలసరి ఆదాయంలో కాదు..అప్పుల్లో అన్నది నాబార్డు అన్న సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందన్నారు. వృద్ధిరేట్లకు ఏపీ ప్రభుత్వం చెబుతున్న అంకెలకు పచ్చి మోసమని, చంద్రబాబు ప్రజలను దగా చేస్తున్నారని, బాబు పాలనలో వ్యవసాయంలో, పారిశ్రామికీకరణలో ఏమాత్రంఅభివృద్ధి లేదని ప్రతి సమావేశంలో మా నాయకుడు వైయస్‌ జగన్‌ బయటపెడుతున్నారని చెప్పారు. 
– లేని పెట్టుబడులు వచ్చాయని, రూ. 20 లక్షల కోట్లు పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని, అవేవి దేవతా వస్త్రాలు కావన్నారు. నాబార్డు సంస్థ, నీతి అయోగ్‌ అధ్యక్షుడు విడుదల చేసిన నివేదికలో ఏపీ వ్యవసాయంలో ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చెప్పారన్నారు. దేశంలోకెల్లా రికార్డు స్థాయిలో రుణమాఫీ చేశామని, నదుల అనుసంధానంలో దేశంలో ఏపీనే మొదటి రాష్ట్రమన్నారు. కృష్ణానదిలో చెండు నీళ్లు ముంచి గోదావరిలో ఆ చెంబు నీళ్లు కలిపితే నదుల అనుసంధానమవుతుందా అని ప్రశ్నించారు. జీడీపీలో అత్యధిక భాగం వ్యవసాయం నుంచే వస్తుందని బాబు పదే పదే చెబుతున్నారన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చెబుతున్నది పచ్చి అబద్ధమన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బాబు పాలనలో రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని, ప్రజలు అధోగతికి చేరుకుంటున్నారని, వాస్తవాలను ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.  హామీల విషయంలో ఏపీ సర్కార్‌ది మోసపూరిత వైఖరి అని మండిపడ్డారు. 
 
Back to Top