చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడా దొరకడం లేదు


దీక్షల పేరుతో టీడీపీ నాయకుల డ్రామాలు
 
హైదరాబాద్‌: చంద్రబాబు ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడింది కానీ, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడా దొరకడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకులు దీక్షల పేరుతో నాటకాటాలడుతున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  హత్య చేసిన వ్యక్తి బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. ఈ నాలుగేళ్లు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని తన భుజాలపై మోశారని, విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని కేంద్రం నెరవేరుస్తుందని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారన్నారు. అడగనివి కూడా కేంద్రం చేస్తుందని చంద్రబాబు ఊరూవాడా ప్రచారం చేశారని గుర్తు చేశారు. విభజన చట్టంలోని ఐదు ముఖ్యమైన అంశాలు ఆరు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. 2014 మార్చి 1వ తేదీన దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత ఆరు నెలల లోగా రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, విశాఖ కారిడార్‌ ఇలా ఐదు అంశాలపై గెజిట్లో స్పష్టంగా చెప్పారన్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు ఏ రోజు కూడా అవి గుర్తుకు రాలేదన్నారు. విభజన హామీలను గుర్తు చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీని అణగద్రొక్కారని మండిపడ్డారు.  బీజేపీ ప్రభుత్వాన్ని ఆకాశమంతా ఎత్తు మోసిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. వైసయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు.

ప్రజా అవసరాలను రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడమే చంద్రబాబు నైజమని భూమన విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఏమాత్రం చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని తాము నిరూపిస్తామని, చర్చకు చంద్రబాబు సిద్దమా అని సవాల్‌ విసిరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్‌ బయట దొరుకుతుందని, కానీ టీడీపీ ఎన్నికల మేనిఫిస్టో మాత్రం దొరకదని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం చంద్రబాబుదేనని ఆయన విమర్శించారు. 87 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఏమైందని, నిరుద్యోగులకు భృతి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 

కేంద్రం అన్నీ చేస్తోందని ప్రచారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందని మొసలి కన్నీరు కారుస్తున్నారని కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. రైల్వే జోన్‌ ఉక్కు ఫ్యాక్టరీ, పెట్రో కాంప్లెక్స్‌, చెన్నై విశాఖ కారిడార్‌లను ఆరునెలల్లో పూర్తి చేయాలని గెజిట్లో ఉన్నా కూడా, కేంద్రంలో ఉండి విభజన హామీలను విస్మరించారని మండిపడ్డారు. నాలుగేళ్లలో రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని, దేశమంతా తెలుగుదేశం పార్టీ గజదొంగ  పార్టీ అని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు ఇస్తే రాష్ట్రానికి అన్నీ సాధిస్తామంటున్నారని, ఇప్పుడు 20 మంది ఉన్నా ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు లాంటి మోసకారి స్వాతంత్ర్య పోరాటంలో ఉండి ఉంటే దేశానికి ఇప్పటి వరకూ స్వాతంత్ర్యం వచ్చేది కాదని విమర్శించారు.

బీజేపీతో చంద్రబాబు లోపాయికారి పొత్తులు పెట్టుకున్నారని, బయటకు మాత్రం వ్యతిరేకమని నటిస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు బీజేపీ-టీడీపీ మోసాలపై పోరాటం చేస్తుంటామని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ముతో లోకేష్‌ను సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ చంద్రబాబు పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే రాక్షస పాలనను అంతమొందిస్తామని భూమన చెప్పారు. దీక్షతో ఐదు కేజీలు తగ్గాలని దీక్ష చేయడం రాష్ట్రంపై వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని భూమన స్పష్టం చేశారు.


 
Back to Top