సీబీఐ అంటే భయమెందుకు

ప్రతిపక్షనేత సవాల్‌ స్వీకరించు చంద్రబాబూ
మైనింగ్‌ మాఫియా, ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దులో బాబు హస్తం
కేసులు నీరుగార్చేందుకే సీబీ సీఐడీ ఎంక్వైరీ
తాత్కాలిక సచివాలయం కొనసాగుతున్న లీకేజీల పర్వం
నిర్మాణాల పేరుతో వందల కోట్లు దోచుకున్న చంద్రబాబు
విష జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకోని సర్కార్‌
ఎప్పుడూ దోపిడీ తప్ప ప్రజల సమస్యలు పట్టవా?
వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
కేరళ వదర బాధితులకు రూ. కోటి సాయం చేసిన ప్రతిపక్షనేత

హైదరాబాద్‌: చంద్రబాబు నిజాయితీ పరుడయితే మైనింగ్‌ మాఫియా, భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దుపై సీబీఐ విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. అన్ని వేళలో అందరినీ మోసం చేయలేమని పెద్దలు చెబుతుంటారని, చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్‌ చేయడం, మాయమాటలతో ప్రజలను ఎంతకాలమైనా మభ్యపెట్టాలనుకోవడం కష్టమన్నారు. అవినీతి బాగోతాలు బయటపడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద మైనింగ్‌ మాఫియాపై కోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని, వందల కోట్ల దోపిడీ జరుగుతుంటే అధికారులు, ప్రభుత్వం నిద్రపోతుందా..? వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. గనుల మాఫియాలో వాస్తవాలను బయటపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైయస్‌ఆర్‌ సీపీ నేతలమంతా కలిసి దాచేపల్లికి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకొని సీబీ సీఐడీ ఎంక్వైరీ వేసిందన్నారు. ఆ ఎంక్వైరీలో ప్రధాన నిందితులను పక్కనబెట్టి కూలీలు, సూపర్‌వైజర్లు, మేస్తీ్రల మీద కేసులు బనాయించి వారే ముద్దాయిలుగా చూపుతూ విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 
పోలీసులు బెదిరించడం సిగ్గుచేటు..
ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ పెద్దల పేర్లు చెప్పొద్దని పోలీసులు స్థానిక ప్రజలను బెదిరించడం సిగ్గుచేటని బొత్స ధ్వజమెత్తారు. మైనింగ్‌ మాఫియాపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారన్నారు. మైనింగ్‌ మాఫియాలో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల హస్తం లేకపోతే ఎందుకు జంకుతున్నారని బొత్స ప్రశ్నించారు. 
ఇద్దరూ చేతులు కలిపే రద్దు చేశారు..
భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దు అంశంపై కూడా సీబీఐ ఎంక్వైరీ వేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు కేంద్రంలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ఎయిర్‌పోర్టు అధికారిటీ ఆఫ్‌ ఇండియా గతంలో అశోక్‌గజపతిరాజు శాఖ సంస్థ టెండర్‌ వేసిందన్నారు. ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా.. ఆ టెండర్‌ను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టి దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు కలిసి టెండర్‌ రద్దు చేశారన్నారు. ఆ నేపథ్యంలోనే తప్పు జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధానికి లేఖ రాసిందని, దానికి సాంకేతిక పరిజ్ఞానం లేదని అప్పటి మంత్రి అశోక్‌గజపతిరాజు చెప్పారన్నారు. కాగా ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అవినీతి కోసం టెండర్‌ రద్దు చేశారనే మాటలను కూడా పొందుపరిచిందన్నారు. 
బాబు దోపిడీ ప్రజలు తెలుసుకోవాలి..
గుంటూరు మైనింగ్‌ మాఫియా, ఎయిర్‌పోర్టు టెండర్‌ రద్దులో ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ రెండింటిలో చంద్రబాబు ముద్దాయి కాకపోతే నిజాయితీ పరుడైతే సీబీఐ ఎంక్వైరీ వేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. లేకపోతే ఎప్పటికైనా ప్రజాకోర్టులో ముద్దాయిలుగా నిలబడతారు దానికి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి చూడొద్దని, ఇకనైనా దోపిడీ ఆపి రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు.  
వందల కోట్లు దోపిడీ..
వందలాది కోట్లు దోపిడీ చేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయం పట్టుకుంటే పడిపోతుందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే లీకేజీలు, గోడలు పడిపోతున్నాయన్నారు. రూ. 10 వేల చదరపు అడుగుకు ఖర్చు చేసి నిర్మించిన భవనాల్లో లీకేజీల పర్వం కొనసాగుతుందన్నారు. సీలింగ్, గోడలు కూలిపోయే ఫొటోలు చూస్తే బాధగా ఉందని, ప్రజాధనం ఈ విధంగా దోపిడీ చేయడం దుర్మార్గమన్నారు. నాణ్యమైన నిర్మాణం జరగడం లేదని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ చెబితే రాజధాని నిర్మాణం వీరికి ఇష్టం లేదని ఆరోపణలు చేశారని, మరీ లీకేజీల ఫొటోలకు చంద్రబాబు, మంత్రులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిపుణులు, మేధావులు చెప్పినా వినకుండా చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడన్నారు. 
సహాయక చర్యలు చేపట్టండి ముఖ్యమంత్రి గారూ..
మూడ్రోజులుగా ఆంధ్రరాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో బీభత్సంగా ఉందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖ, విజయవా ప్రాంతాల్లోని ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి బాధ్యతగల అధికారులను నియమించి ప్రజల ఇబ్బందులు పడుతున్న చోట సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలలో ఒక బెడ్‌ మీద ఇద్దరు ముగ్గురు రోగులు పడుకునే దుస్థితి. విజయనగరం పీహెచ్‌సీలో డాక్టర్లే లేరన్నారు. 108 అంబులెన్స్‌లు లేక మనుషులను మంచాలపై మోసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు పట్టకుండా ఎక్కడ అవినీతి చేద్దామా అనే ఉద్దేశం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా  క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్దామంటే పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్భందించడం తప్ప ప్రభుత్వం చేసేది ఏమీ లేదని ధ్వజమెత్తారు. . 
కేరళ బాధితులకు రూ. కోటి సాయం
పకృతి వైపరిత్యాలతో అతలాకుతలమైన కేరళ ప్రాంత ప్రజల సహయార్థం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతంగా, పార్టీ తరుపున రూ. కోటి ఆర్థిక సాయం అందించారన్నారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారన్నారు. అదే విధంగా పకృతి వైపరిత్యాలతో సర్వం కోల్పోయిన ప్రజల పట్ల వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి వ్యక్తం చేస్తుందన్నారు. 
 
Back to Top