కడప ఉక్కు ఫ్యాకర్టీ కోసం ఉద్యమం ఉధృతం


– ఉక్కు పరిశ్రమను అడ్డుకుంది చంద్రబాబే
–  23న కడప, 24న బద్వేల్, 25న రాజంపేటలో ధర్నాలు
– 26న జమ్ములమడుగులో నిరాహార దీక్ష
– 27న రహదారుల దిగ్బంధం, 29న రాష్ట్ర బంద్‌
– అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతాం

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్ష విరమణ అనంతరం అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఉక్కు పరిశ్రమ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు, రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, గోవిందరెడ్డి తదితరులతో కలిసి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  నాలుగేళ్లుగా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజుపట్నం వంటి అంశాలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ, చంద్రబాబులు ఇద్దరూ కలిసి హామీలు అన్నీ అమలు చేస్తామని ఓట్లు వేయించుకున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ఏది కూడా అమలు చేయకుండా అసాధ్యమని మోసం చేశారన్నారు. నాలుగేళ్ల పాటు కేంద్రంతో పాటు కలిసి పని చేసిన టీడీపీ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో కృషి చేశారన్నారు. స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు మహాసంకల్పం చేపట్టారన్నారు. ఆ రోజు ఓ అధ్యాయన కమిటీ కూడా ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయని తేల్చి చెప్పిందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని చంద్రబాబు ఆ రోజు అడ్డుకున్నారన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు అయి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. విశాఖ, బళ్లారిల మాదిరిగా కడప ఉక్కు కూడా ఉపయోగకరంగా ఉండేదన్నారు. 

మహానేత మరణాంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. సైల్‌ లాంటి వంటి కంపెనీ వచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మేలు జరిగేదన్నారు. నాలుగేళ్లుగా ప్రజలు, ప్రజా సంఘాలు, వైయస్‌ఆర్‌సీపీ ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతుంటే నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఉక్కు పరిశ్రమ కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పినా కూడా టీడీపీ మౌనంగా ఉండి..ఇప్పుడు పోరాటం చేస్తామని నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేరంలో చంద్రబాబు పూర్తి భాగస్వామి, సూత్రదారి అని విమర్శించారు. ఈ రోజు పోరాటం చేస్తున్నామని దొంగ దీక్షలు, పోరాటాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. 

కడప ఉక్కు పరిశ్రమ స్థాపన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నమన్నారు. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఉక్కు పరిశ్రమ సాధనకు 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారన్నారు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు సీపీఎం, సీపీఐ వంటి పార్టీలతో కలిసి అఖిలపక్షంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 23న కడపలో మహాధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటలో, 26న జమ్ములమడుగులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపడుతామని చెప్పారు. 27న రహదారుల దిగ్భందం, 29న రాష్ట్ర బంద్‌ చేపడుతున్నట్లు ప్రణాళికను ప్రకటించారు. వేలాది మంది ప్రజలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కడప ఉక్కు పరిశ్రమ జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని తెలిపారు.  
  
 
Back to Top