రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన బాబు

హైదరాబాద్, డిసెంబరు 11: రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను నిలువునా మోసగించారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాకుండానే మాఫీ చేసేశామని చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గురువారం తిరుపతిలో జరిగిన సభలో తిరుమల వెంకన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. 'జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే రోజున ప్రభుత్వ ప్రకటనల్లో 'వ్యవసాయ రుణాలన్నీ మాఫీ' అని పేర్కొన్నారని, అయితే వాస్తవానికి ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యానవన పంటలను రుణమాఫీ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. తిరుపతిలో సీఎం పాల్గొన్న సభలో సుబ్రమణ్యం శెట్టి అనే రైతు మామిడి తోట కోసం తీసుకున్న రూ. 30 వేల రుణం మాఫీ అయినట్లుగా చెప్పించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఏడెకరాలున్న మరో రైతు పురుషోత్తంకు రూ. లక్షన్నర రుణమాఫీ జరిగినట్లు వేదికపై చెప్పించడంపైనా నాగిరెడ్డి స్పందించారు. 'పురుషోత్తం పొలంలో చెరకు, వరి, మామిడి పండిస్తున్నట్లు చెప్పారు. రూ. లక్షన్నర రుణంలో ఏటా 20 శాతం చొప్పున ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు ఏ లెక్క ప్రకారం ఆయనకు లక్షన్నర మాఫీ జరిగిపోయిందని చెప్పిస్తారు?' అని ప్రశ్నించారు. పురుషోత్తం రుణంపై ఏటా పడే 14 శాతం వడ్డీ మాటేమిటని ప్రశ్నించారు. 

రుణమాఫీ జరిగినట్లు రైతు చేతికి చంద్రబాబు ఓ సర్టిఫికేట్ ఇస్తే అంతా మాఫీ అయినట్లేనా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. డిసెంబరు పదో తేదీ లోపుగా రైతుల ఖాతాల్లో మాఫీ డబ్బు జమ అవుతుందని చెప్పడం కూడా అబద్దమేనన్నారు. 'కృష్ణా జిల్లాలో బాగా లాభాల్లో ఉండే ఓ సహాకార సంఘంలో 1,013 అర్హత కలిగిన ఖాతాలుంటే 595 వ్యాలిడ్ ఖాతాలే ఉన్నట్లు తేల్చారు. అందులో మళ్లీ రూ. 50 వేలు తీసుకున్న ఖాతాలు 392 ఉంటే రుణమాఫీ లబ్ధి చేకూరేది 219 మందికేనని వెబ్ సైట్ లో ఉంచారు. దీన్ని కూడా రుణమాఫీ అంటారా' అని అన్నారు. ' ఓ రైతు రూ. 62,500 తీసుకుంటే ఆయనకు రూ. 53, 047 మేరకు రుణార్హత ఉందని నిర్ధారించారు. ఆయన ఖాతాలో జమ అయింది రూ. 10,069 మాత్రమే, ఇందులో బ్యాంకులు విధించిన 14 శాతం వడ్డీ కింద రూ. 8,695 జమ చేసుకుంటారు. అంటే ఆ రైతుకు తొలి విడతలో రూ. 1,914 మాత్రమే రుణమాఫీ జరిగినట్లైంది. మిగతా నాలుగేళ్లలో కూడా ఈ రుణంపై ఏటా 14 శాతం వడ్డీ పడుతుంది. రైతులను ఇంత మోసం చేయడమెందుకు?' అని నాగిరెడ్డి నిలదీశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పైనా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందన్నారు. 2013-14లో ఎకరా వరికి రూ.24 వేలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎస్ఎల్బీసీ(బ్యాంకర్ల) సమావేశం నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రూ. 19 వేలు తీసుకుంటుందని ప్రశ్నించారు.

Back to Top