చంద్రబాబులో ఏడాదికి ముందే ఓటమి భయం– ఈవీఎంల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరం
– ఇప్పటికైనా సీఎం పదవి బాలకృష్ణకు ఇవ్వాలి
హైదరాబాద్‌:  వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని, ఏడాదికి ముందే చంద్రబాబు ఓటమిని ఒప్పుకున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. 2014లో ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా గెలిస్తేనేమో నిజాయితీ, వేరే వాళ్లు గెలిస్తే మాత్రం సక్రమం అవుతుందా అని నిలదీశారు. 2014 చంద్రబాబు ట్యాంపరింగ్‌ చేశారా అని ఆమె ప్రశ్నించారు. ట్రైనింగ్‌ పొందిన ఓ దొంగను పక్కన పెట్టుకున్న చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం చేసి రూ. 4 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారన్నారు. అన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని జాతీయ సర్వేలే చెబుతున్నాయని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు నేర చరిత్ర కలిగి ఉన్నారని జాతీయ మీడియా, సర్వేలు చెబుతున్నాయని చెప్పారు. సొంత సర్వేల్లోనూ టీడీపీకి ప్రతికూల ఫలితాలు రావడంతో చంద్రబాబు ఇలాంటి అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారుఎన్‌టీఆర్‌ అభిమానులు బాలకృష్ణ సీఎం కావాలని కోరుతున్నారని, ఇకనైనా టీడీపీని ఎన్‌టీఆర్‌ కుమారుడికి ఇవ్వాలని సూచించారు. ఇటీవల మోత్కుపల్లి, పోసాని కృష్ణమురళీ కూడా చంద్రబాబును విమర్శించారని, జెండా నీది కానప్పుడు ఎందుకు మోసం చేస్తావని పేర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖంలో భయం స్పష్టంగా కనబడుతుందని, ఇకనైనా చంద్రబాబు తప్పుకోవాలని సూచించారు. టీటీడీలో ఆగమన శాస్త్ర్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే దాన్ని సరిచే యకుండా రాజకీయం చేసిన చంద్రబాబు ఇవాళ టీటీడీ ద్వారా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీకి నోటీసులు ఇప్పించడం దారుణమన్నారు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి సీబీఐ విచారణ చేయించుకొని నిజాయితీ నిరూపించుకోవాలని కానీ, తప్పించుకోవడం, స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైందన్నారు. శేఖర్‌రెడ్డి కేసుకు సంబంధించి పవన్‌ కళ్యాణ్‌ నారా లోకేష్‌పై ఆరోపణలు చేశారని, ఆ కేసుపై ఎందుకు విచారణ చేయించడం లేదని నిలదీశారు. నీకు నీవే నిప్పు అని చెప్పుకుంటే సరిపోదని, విచారణకు సిద్ధం కావాలని ఆమె డిమాండు చేశారు. ఇప్పటికైనా నందమూరి వారసుడైన బాలకృష్ణకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆమె డిమాండు చేశారు.
 
Back to Top