చంద్రన్న మాల్స్‌ పేరుతో దోపిడీ– బాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప రేషన్‌ ఏదీ ఇవ్వడం లేదు
–  పసుపు రంగుతో  చవకబాబు దుకాణాలు ప్రారంభం

విజయవాడ: చంద్రన్న రిలయన్స్‌ మాల్స్‌ పేరుతో టీడీపీ ప్రభుత్వం దోపిడీకి తెర లేపిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.  టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. నాడు చౌక దుకాణాల్లో 9 రకాల సరుకులు చౌక ధరలకే దక్కేవన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పేదలకు నిత్యావసర వస్తువులు అందడం లేదన్నారు. తన పేరుతో పథకాలు పెట్టరేమోనని అభద్రతాభావం చంద్రబాబు ఉందని, అందుకే ఈయన బతికుండగానే తన పేరుతో పథకాలు ప్రవేశపెడుతున్నారని  ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోతే ప్రజలు స్వచ్ఛందంగా వీధికో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారన్నారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ టీడీపీ కార్యాలయాల మాదిరిగా పూర్తిగా పసుపు రంగుతో చౌక దుకాణాలను అలంకరించడం దారుణమన్నారు.   రూ.3 వేల కోట్ల వ్యాపారం ఉన్న హెరిటేజ్‌ను రూ.30 వేల కోట్ల వరకు చేయాలని నారా బ్రహ్మణి అన్నారని, అందులో భాగంగానే వాళ్ల సొంత కంపెనీకి చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ కట్టబెట్టారన్నారు. చంద్రన్న మాల్స్‌లో మార్కెట్‌ ధర కన్నా అధిక రేట్లు పెట్టి అమ్ముతున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల రేట్లు విఫరీతంగా పెంచి సామాన్య, పేద ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందని వెల్లంపల్లి శ్రీనివాసు తెలిపారు. ప్రజలకు తెల్లకార్డులకే నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇవాళ ఏపీ ప్రజలకు దుర్దినం: మల్లాది విష్ణు
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు దుర్దినమని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 29 వేల రేషన్‌çషాపులు, 1.30 కోట్ల మంది కార్డుదారులు ఉన్నారన్నారు. విలేజ్‌ మాల్స్‌ను ఇవాళ విజయవాడ, గుంటూరులో ప్రారంభించిందని, ఇలాంటి మాల్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. కంది పప్పు కేజీ మార్కెట్లో రూ.62 ధర ఉందన్నారు. అదే మాల్స్‌లో అర్ధకేజీ రూ.51 ధర ఉందన్నారు. ఇది ఏవిధంగా పేదలకు ఉపయోగపడుతుందని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్‌ పేరుతో చంద్రబాబు చేస్తున్న పెద్ద వ్యాపారాన్ని దొడ్డిదారిలో రిటైల్‌ రంగంలోకి తీసుకువచ్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. చిన్న చిన్న గ్రామాల్లో చిరువ్యాపారులు లేకుండా చేసేందుకు కార్పొరేట్‌సంస్థలకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుందన్నారు. విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని మల్లాది విష్ణు హెచ్చరించారు. పేదలకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.


 
Back to Top