పంటలు ఎండిపోతే దిగుబడులు ఎలా పెరిగాయి?

– ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది
– దిగుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
– స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు కావడం లేదు
– బడ్జెట్‌లో వ్యవసాయంపై ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలే
 

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయంపై తప్పుడు లెక్కలు చెబుతూ రైతులను మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. ఈ ఏడాది గరిష్టంగా సాగు విస్తీర్ణం తగ్గితే దిగుబడులు పెరిగాయని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందన్నారు. పంటలు ఎండిపోతే దిగుబడులు ఎలా పెరిగాయని ఆయన నిలదీశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి బడ్జెట్‌ కేటాయింపులపై మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. . ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్‌ 4.6 శాతం మాత్రమే పెంచిందన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖమంత్రి రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సాగు విస్తీర్ణం తగ్గితే ఆదాయం ఎలా పెరిగిందన్నారు. 
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ 13 జిల్లాల్లో 45.65 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందనానరు. చంద్రబాబు సీఎం అయ్యాక 2014–15లో 40.96 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందన్నారు. ఈ ఏడాది 35.9 లక్షల హెక్టార్లలో సాగు జరిగిందన్నారు. ఇంత తక్కువ సాగు ఎప్పుడు జరగలేదన్నారు. లక్షల హెక్టార్లలో వేరుశనగ, కంది పంటలు ఎండిపోయాయన్నారు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ఆర్‌ హయాంలో ఎంత దిగుబడులు వచ్చాయో, మీ హయాంలో ఏ మేరకు దిగుబడులు వచ్చాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. 25 నుంచి 30 శాతం రైతులు పంటను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కూడా రైతులు అమ్ముకోలేని దుర్భర స్థితిలో రైతులు ఉన్నారన్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ప్రసంగానే వల్లవేశారన్నారు. స్వామినాథన్‌ కమిటి సిపార్సులు అమలు కాలేదని ధ్వజమెత్తారు. విద్యుత్‌ కోతల కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 


 
 
Back to Top