పోల‌వ‌రాన్ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తి చేయాలి

 

రాజమండ్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నిర్మిస్తానన్న పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఏం సంబంధం ఉందని నిలదీశారు. పోలవరం నా కల అని, నా కన్ను అని, దీని కోసమే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టానని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ప్రతి రూపాయితో కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని మండిపడ్డారు. తాత్కాలికమైన మాటలు, తాత్కాలికమైన అడ్డుకట్టలతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. ప్రజల జీవనాడి అయిన పోలవరానికి ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్ని అనుమతులు తీసుకువచ్చారని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్మించాలని నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.

 మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించి నాలుగేళ్లు గడిచిందన్నారు. 2018 నాటికే నిర్మాణం పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు శాసనసభలో ప్రకటించారని గుర్తు చేశారు. హడావుడిగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, 2019 నాటికి పోలవరం పూర్తి కాదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. అంచనా వ్యయాన్ని ఇష్టమొచ్చినట్టుగా పెంచేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, కేంద్ర ఎన్నినిధులు ఇచ్చిందో చంద్రబాబు చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
 
Back to Top