ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే

– చంద్రబాబుతో మా బంధం ఎప్పటికీ తెగిపోదన్న రాజ్‌నాథ్‌సింగ్‌
– లోక్‌సభ సాక్షిగా బయటపడ్డ బీజేపీ– టీడీపీ బంధం 
ఢిల్లీ: ఎన్టీఏతో తెగదెంపులు టీడీపీ ఆడిన డ్రామానే అని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని మరోమారు పార్లమెంట్‌ సాక్షిగా రుజువైందని ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ–బీజేపీ మధ్య ఉన్న బంధం ప్రత్యక్షంగా రుజువైందని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ పార్లమెంట్లో టీడీపీతో ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు ఈ రోజుకు కూడా మాకు మిత్రుడే అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారన్నారు. పార్టీలు వేరైనా మా సంబంధాలు కొనసాగుతున్నాయని క్లీయర్‌గా చెప్పారన్నారు. మేం బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా ఏనాడు అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చర్చకు తీసుకున్నారంటే వారి మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.  లోపాయికారిగా బీజేపీ, టీడీపీలు ఒప్పందాలు చేసుకొని వీడిపోయినట్లు నటిస్తూ  ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.  మేం చెప్పిందే ఈ రోజు సభా సాక్షిగా తేటతెల్లమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టారా? లేక వారి మిత్రత్వం కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ, టీడీపీలకు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. 
 
Back to Top