బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు వేయం


  
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కోసం జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌పై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కె. హరిప్రసాద్‌కు గానీ తాము మద్దతివ్వడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి గురువారం న్యూఢిల్లీలోమీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేశాయని.. అందులో సందేహమే లేదన్నారు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు అందుకే ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి బీజేపీ ద్రోహం చేసిందన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేవలం మాటగా చెప్పారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ విధంగా ఏపీకి తీరని ద్రోహం చేసిందన్నారు. మరోవైపు పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. ఏపీకి ద్రోహం చేసిన రెండు పార్టీలతో కుమ్మక్కై టీడీపీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లాంటి కీలక రాజ్యాంగ పదవులు ఏవైనా ఏకగ్రీవం కావాలనేది తమ అభిప్రాయమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా, ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.Back to Top