అసెంబ్లీలో డ్వాక్రా, రుణమాఫీపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టు

హైదరాబాద్: ప్రతిపక్షం నిరసనలు, నినాదాలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. డ్వాక్రా, రుణమాఫీపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. మరొక రోజులో సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షం డిమాండ్ చేసింది.  

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి డ్వాక్రా, రైతు రుణమాఫీపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. అయితే ఇప్పటికే ఆ అంశంపై సభలో చర్చ జరిగిందని, ఒకవేళ చర్చించాలంటే తీర్మానం ఇవ్వాలని స్పీకర్ సూచించారు. అయినా విపక్ష సభ్యులు తమ పట్టువీడలేదు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉందన్నారు.
Back to Top