18న వైయస్సార్‌ సీపీ దర్శి నియోజకవర్గ ప్లీనరీ

దర్శి : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దర్శి నియోజకవర్గ స్థాయి ప్లీనరీని ఈ నెల 18న విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు దర్శి తాలూకా క్లబ్‌ కల్యాణ మండపంలో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించేలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలు నిర్వహించాలని నాయకులకు సూచించడం అభినందనీయమన్నారు. పార్టీ పటిష్టం కోసం పలు తీర్మానాలు చేస్తామన్నారు. ప్లీనరీకి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నియోజకవర్గ ప్లీనరీ ఇన్‌చార్జి వరికూటి అమృతపాణి హాజరవుతారని బూచేపల్లి తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు దద్దాలమ్మ దేవస్థానం నుంచి గడియారం స్తంభం సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని చెప్పారు. అనంతరం 10 గంటల నుంచి ప్లీనరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా విభాగాల అనుబంధ సంస్థలు, గ్రామ కమిటీ మెంబర్లు హాజరై జయప్రదం చేయాలని బూచేపల్లి కోరారు.

Back to Top