'29న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరగాలి'

పట్నంబజారు (గుంటూరు) : ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిమ్మ తిరగాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం పార్టీ జిల్లా, నగర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొత్స మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

అన్ని కార్మిక, కర్షక, వాణిజ్య, విద్యార్థి సంఘాలతో చర్చించి సంఘటితం చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో సైతం వాటాలు తీసుకునే స్ధితికి స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని దిగజారిపోయారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర మంత్రులు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని, హోదా విషయంలో ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదన్నారు.
Back to Top