జైరాం రమేశ్‌పై ఈసీకి వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు

హైదరాబాద్ :

మునిసిపల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ సీమాంధ్రకు హామీలు గుప్పించిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్ పై చర్యలు తీసుకోవాలని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంతరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ సీజీసీ సభ్యుడు జూపూడి ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రరావు, బి.జన‌క్‌ప్రసాద్ మంగళవారం ఎన్నికల కమిషన‌ర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

మునిసిపల్ ఎన్నికల నియమావళి 3వ తేదీ 10గంటల నుంచే అమలులోకి వచ్చిందని, అయితే జైరాం రమే‌శ్ విశాఖపట్నంలో మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం ‌నిర్వహించి రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏమేమి చేయబోయేది ప్రకటించారని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజ్యసభలో ప్రధాని ప్రకటించినందున వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల గ్రాంటు లభిస్తుందని చెప్పారని, ప్రణాళికా సంఘం పేర్కొనక ముందే జైరాం రమేశ్ ప్రకటించడం ఆశ్చర్యకరమని వారు పేర్కొన్నారు.

‌‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరు నెల‌ల లోపు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే అంతకు ముందే జైరాం వీటిని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేస్తామని ఎలా ప్రకటిస్తారని తమ ఫిర్యాదులో  వైయస్ఆర్‌సీపీ నాయకులు ప్రస్తావించారు. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఆరు‌ నెలల లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘ఐఓసీ’, ‘హె‌చ్‌పీసీఎల్’ ఆయిల్ కంపెనీలు, నూనెశుద్ధి కర్మాగారాన్ని నిర్మించే విషయాన్ని పరిశీలిస్తామని చట్టంలో పేర్కొంటే, సాధ్యాసాధ్యాల పరిశీలన ఏదీ లేకుండానే రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారని పేర్కొన్నారు.

‌గుంటూరులో బుధవారం జరిగిన సమావేశంలో కూడా జైరాం రమేశ్ మళ్లీ ఇవే అంశాలు వెల్లడించారని వారు కమిషనర్ దృష్టికి తెచ్చారు.

రాజధానిని నిర్ణయించడానికి వారెవరు?:
సీమాంధ్రుల రాజధాని ఎక్కడో నిర్ణయించేది నాలుగు రోజుల్లో ఇంటికిపోయే వారా అని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాజధాని ఎక్కడ ఉండబోతోంది, ఎలా కట్టబోతున్నాం.. సచివాలయం ఫలానా చోట, హైకోర్టు బెంచీ ఫలానా చోట ఉండొచ్చు అని రకరకాలుగా చెబుతున్నారు. అలా మాట్లాడ్డానికి ఆయనెవరు?’ అని నిలదీశారు.

హైదరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిని వికేంద్రీకరించాలని అనుకుంటున్నామన్న మంత్రి జైరాం వ్యాఖ్యలను ‌జూపూడి తీవ్రంగా తప్పుపట్టారు. ‘రాజధాని అంటే అన్ని కీలక అంగాలు ఒకచోట ఉండాలా.. లేదా? దేహానికి సంబంధించిన కిడ్నీలు ఒకచోట, లివర్ మరోచోట, గుండె ఇంకొకచోట ఉండేలా విడగొడితే మనుగడ సాధ్యమవుతుందా?’ అని జూపూడి ప్రశ్నించారు.

Back to Top