బాబు బాకా ‘పాంచజన్యం’పై ఫిర్యాదు

హైదరాబాద్:

ఈనాడు దినపత్రిక ‘పాంచజన్యం’ పేరుతో చంద్రబాబు నాయుడికి బాకా ఊదుతూ ప్రచురిస్తున్న అసత్య కథనాలను ‘చెల్లింపు వార్తలు’ (పెయిడ్ ఆర్టిక‌ల్సు)గా పరిగణించాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ పేరిట ఉన్న ఫిర్యాదు‌ పత్రాన్ని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారంనాడు డిప్యూటీ సీఈవో దేవసేనకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈనాడు ఎన్నికల కథనాల పేరుతో పేజీలకు పేజీలుగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై విషం కక్కడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వాసిరెడ్డి అన్నారు. ‘ప్రత్యేకించి ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ రోజున దురుద్దేశంతో, కుట్ర పూరితంగా శ్రీ ‌జగన్‌పై విషం కక్కుతూ ఈనాడు ప్రచురించిన కథనంపై సీఈవోకు పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం అన్నారు. చంద్రబాబును, జగన్‌తో పోల్చుతూ పేజీ అంతా అబద్ధపు రాతలతో నింపేశారని నిప్పులు చెరిగారు. శ్రీ జగన్‌ను కించపరిచేలా, ప్రజల్లో పలుచన చేయాలనే దురుద్దేశంతోనే అలా ప్రచురించారని ఆరోపించారు.

చంద్రబాబునాయుడిని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఎజెండాతోనే ఆ పత్రిక పనిచేస్తోందని పద్మ విమర్శించారు. కనీసం రాష్ట్ర విభజన సమయంలో ప్రజల తరఫున మాట్లాడిన పాపాన పోని ఆ పత్రిక.. ప్రజల్లో ఉన్న వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడిపై విషం కక్కడానికి మాత్రం అక్షరాలను తాకట్టు పెట్టి బాబుకు ఊడిగం చేస్తోందని తూర్పారపట్టారు. టీడీపీకి బాకా లాగా ‘పాంచజన్యం’ వస్తోందన్నారు. ఈనాడు ఎన్నికల స్పెషల్‌ను చెల్లింపు కథనాలుగా పరిగణించి టీడీపీ ఎన్నికల ఖర్చులో చూపాలని కోరినట్లు చెప్పారు. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక టీడీపీకి అధికార పత్రికగా, కరపత్రంగా మారిందన్నారు. తమ ఫిర్యాదును ఎన్నికల సంఘం కచ్చితంగా పరిశీలిస్తుందిదని వాసిరెడ్డి పద్మ చెప్పారు. సీఈవో భన్వర్‌లాల్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సీఈవో దేవసేనకి ఫిర్యాదు అందించామని వెల్లడించారు.

Back to Top