అసెంబ్లీ లో అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసింది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా శాసనసభ నుంచి ఎమ్మెల్యే రోజాను బహిష్కరించటాన్ని తప్పు పట్టారు. రూల్ 340 ప్రకారం స్పీకర్ కు సమావేశాల వరకు సస్పెండ్ చేయగలరు కానీ ఇంతింత కాలం పాటు సస్పెండ్ చేయటం కుదరని పని అన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత సభ ద్రష్టికి తీసుకొని వచ్చారు.గత మూడు రోజులుగా సభను చూస్తున్న ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. సెక్సు రాకెట్ మీద చర్చ జరగకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయటానికు ఆఖరికి ఎమ్మెల్యే రోజాను బహిష్కరించాలన్న కుయుక్తికి దిగారని ఆయన స్పష్టం చేశారు. మీ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని స్పీకర్ ను మరోసారి కోరారు. అయినా సరే, ప్రభుత్వ పక్షం దీనికి అంగీకరించలేదు. స్పీకర్ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. బీ ఏ సీ స మావేశంలో జరిగిన నిర్ణయంపై స్పీకర్ మాట్లాడినప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడేందుకు కోరారు. ఆయన గొంతు నొక్కటంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలగచేశారు.సభను ఈ రీతిలో నడుపుతుంటే తాము బయటకువెళతామని చెప్పి వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ సభ్యులు బాయ్ కాట్ చేశారు.