బీసీ వర్గాలను ఆదుకునేలా వైయస్‌ జగన్‌ పయనం

–బీసీలకు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
–  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర బీసీ భరోసా యాత్రగా సాగుతోంది

విజయవాడ: బీసీ వర్గాలను ఆదుకునేలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పయనిస్తున్నారని, ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బీసీ భరోసా యాత్రలా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.  నాలుగేళ్లలో చంద్రబాబు బీసీలకు వరగబెట్టింది ఏమీ లేదన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రకు ఒక ప్రాధాన్యత ఉందన్నారు.  ఇప్పుడు వైయస్‌ జగన్‌ కూడా పాదయాత్ర చేస్తూ అధికారంలోకి రాగానే ఇస్తున్న హామీలన్నీ అమలు చేస్తారన్నారు. టీడీపీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు పొందుపరిచిన అంశాలను ఏమాత్రం నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ జగన్‌కు ఒక విజన్‌ ఉందని, రాష్ట్రంలోని అన్ని వనరులు, అవకాశాలు అన్ని వర్గాలకు చెందాలన్నదే ఆయన ధ్యేయమన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలన్నదే వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. రజకులకు శాసన మండలిలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. నాయిబ్రాహ్మణులకు కూడా చట్టసభలో స్థానం కల్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. కులవృత్తుల వారినే కాకుండా అట్టడుగు వర్గాల్లో ఉన్న వారిని కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించేలా ఆలోచిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపనున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర బీసీ భరోసా యాత్రగా సాగుతుందన్నారు. రాబోయే కాలంలో వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఏయే కార్యక్రమాలు చేపడుతుంది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. బీసీ అధ్యాయన కమిటీని వైయస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని, ఇందులో అన్ని కులాలకు చెందిన మేధావుల సలహాలు, సూచనలు తీసుకొని, వారి బాధలు ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామన్నారు.  బీసీ వర్గాలను ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతుందన్నారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేలా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కుల వృత్తులు చేసే వారిలో 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామన్నది గొప్ప విషయమన్నారు. అధ్యాయన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అందరిని కలుస్తామని జంగా కృష్ణమూర్తి చెప్పారు. ఇప్పటికే కడప జిల్లాలో ఓ అధ్యాయన కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు స్థానం కల్పించామన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ అధ్యాయన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
 
Back to Top