బీసీలపై బాబుది సవతి తల్లి ప్రేమ


- వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి
– రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు
 విజయవాడ: టీడీపీ ప్రభుత్వం బీసీల హక్కులు హరిస్తోందని, బీసీలపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. మెడికల్‌ కౌన్సిలింగ్‌లో బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జంగాకృష్ణమూర్తి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల అంశాలపై ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఫైర్‌ అయ్యారు. మెడికల్‌ కౌన్సిలింగ్‌లో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఈ నెల 5వ తేదీన వినతిపత్రం ఇస్తే..మంత్రి అచ్చెన్నాయుడు 7వ తేదీన విలేకరులతో మాట్లాడుతూ..సవరణలు చేసి న్యాయం చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి చెప్పి పది రోజులు అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. జీవో నంబర్‌ 550 వచ్చిన తరువాత 15 సంవత్సరాల పాటు ఆ జీవోను అమలు చేస్తుండగా జూలై 10న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినప్పుడు ఈ జీవోపై స్టే  ఇచ్చారని తెలిపారు. స్టే ఇ చ్చిన వెంటనే ఆగస్టు 15 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సూచించిందన్నారు. బడుగు, బలహీన వర్గాలు మావైపే ఉన్నారని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు కోర్టు స్టే వెకెట్‌ చేసేందుకు కౌంటర్‌ దాఖలు చేసే సమయం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్య దోరణి కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో సమన్యాయం చేయకపోతే వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు

 
Back to Top