ముర్తుజాను అప్పగించేవరకు పోరాటం

  • ప్రశాంతంగా ఉన్న పోరుమామిళ్లలో ఫ్యాక్షన్ కు తెరలేపారు
  • కిడ్నాప్ చేయడం టీడీపీ విషసంస్కృతి
  • కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని పోలీసులు అప్పగించాలి
  • నిందితులను పట్టుకోవాలిః ఎంపీ  వైయస్‌ అవినాష్‌రెడ్డి
పోరుమామిళ్ల: టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించే వరకు పోరాటం చేస్తామని కడప పార్లమెంటు సభ్యులు వైయస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎందాకైనా వెళ్తామని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన కడప మేయర్‌ సురేష్‌బాబుతో కలసి పోరుమామిళ్ల వచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలతో చర్చించారు. అక్కడికి వచ్చిన డాక్టర్‌ గౌస్‌పీర్‌ కుటుంబ సభ్యులు, మైనారిటీ నాయకులతో మాట్లాడి కిడ్నాప్‌కు గురయిన ముర్తుజా హుసేన్‌కు ఏమీ జరగదని, ఈ విషయంలో ఎలాంటి పోరాటాలకైనా వెనకడుగు వేయబోమన్నారు. ఎస్పీతో మాట్లాడామని, ఆయన మంగళవారం సాయంత్రానికి ముర్తుజా సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారన్నారు. అనంతరం  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి పోలీస్‌స్టేషన్‌కు నడచుకుంటూ వెళ్లారు.

సరైన రీతిలో స్పందించని పోలీసులు:
పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ, మేయర్‌..సీఐ పద్మనాథన్, ఎస్‌ఐపెద్ద ఓబన్నను కలసి మాట్లాడారు. ప్రొద్దుటూరులో కారు స్వాధీనం చేసుకున్నామని, కారు యజమాని, డ్రైవర్‌ ద్వారా కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌ అధికారులు తెలిపారు. సాయంత్రానికి ముర్తుజాను తెస్తామని వారు పేర్కొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ... ఆదివారం కిడ్నాప్‌ అయితే ఇప్పటికీ ఈ విషయంలో పోలీసులు సరైన రీతిలో స్పందించలేదన్నారు. టీడీపీ నాయకులే కారణమనే విషయం తెలిసినా, స్థానికంగా వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని, సాయంత్రానికి ముర్తుజాను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు.
 
ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌ వద్ద విలేకరులతో ఎంపీ మాట్లాడుతూ.. ఈరోజు ఆమరణదీక్షకు కూర్చుంటానని చెప్పడం జరిగిందని, అయితే ఎస్పీ ఈ రోజు సాయంత్రానికి కిడ్నాప్‌ ఛేదిస్తామని హామీ ఇచ్చారన్నారు. సాయంత్రానికి ముర్తుజాను కుటుంబసభ్యులకు అప్పగించకపోతే చెప్పిన కార్యక్రమం జరుగుతుందన్నారు. కిడ్నాప్‌ చేయడం టీడీపీ విష సంస్కృతి అని పేర్కొన్నారు.  ప్రశాంతంగా వున్న పోరుమామిళ్లలో ఫ్యాక్షన్‌కు తెరలేపారన్నారు. కార్యక్రమంలో మేయర్‌సురేష్‌బాబు, నాగార్జునరెడ్డి, రవిప్రకాష్‌రెడ్డి, సియం బాషా తదితరులు పాల్గొన్నారు.


Back to Top