విశాఖలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం ఆరంభం

విశాఖపట్నం: ‘విశాఖలో పార్కులు, స్థలాలు ఆక్రమించుకోవడానికి కడప నుంచి కొందరు వచ్చారని గత ఎన్నికల్లో దుష్ర్పచారం చేసిన టీడీపీ నేతలు అది నిజమని నిరూపించగలరా?’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దుష్ర్పచారం వల్లనే విశాఖలో విజయమ్మ ఓటమి చెందారని, టీడీపీ తాత్కాలికంగా లాభపడిందన్నారు. అయితే ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజు సమకూర్చిన వైఎస్సార్ సీపీ విశాఖపట్నం జిల్లా కార్యాలయాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో కలసి విజయసాయిరెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీపై దుష్ర్పచారం జరిగిందన్నారు.  విజయమ్మ బైబిల్ చేత పట్టుకోవడాన్ని తప్పుగా ప్రచారం చేశారని, పార్టీ అధినేత జగన్ దృష్టిలో అన్ని మతాలు సమానమేనన్నారు. జగన్ వ్యక్తిత్వంపైన తప్పుగా మాట్లాడుతున్నారని, నిజానికి ఆయన ఎవరినీ పల్లెత్తు మాట అనరని తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారులు, మీడియా వద్ద మాట్లాడే పద్ధతి చూస్తేనే అతని వ్యక్తిత్వమెలాంటిదో తెలుస్తుందన్నారు.

పార్టీ పటిష్టతకు ప్రత్యేక వ్యూహం
పార్టీ పటిష్టతకు మూడు అంశాలతో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అన్ని జిల్లాల్లో  పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 5 జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. వైఎస్సార్ సేవాదళ్, వికలాంగులు, పంచాయతీరాజ్ శాఖలను కొత్తగా  ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో 60 నుంచి 70 మంది యువకులతో పార్టీకి,  ప్రజలకు సేవ చేసేందు కోసం సేవాదళ్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ  ఇస్తామన్నారు. టీడీపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే 2019లో వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ధర్మాన సోదరులు బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ ప్రచారం నడుస్తోందని, భవిష్యత్‌లో అధికారంలోకి రానున్న వైఎస్సార్ సీపీని వీడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశంలేని బీజేపీలోకి తాము వెళ్లేది లేదనే విషయం ఆ ప్రచారం చేస్తున్న వారికి కూడా తెలుసని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఉత్తరాంధ్ర జిల్లాల పరిశీలకుడు సుజయ్‌కృష్ణ రంగారావు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మైనారిటీ సెల్ ఐదు జిల్లాల ప్రధాన కార్యదర్శి ఫరూక్, ఎమ్మెల్సీ వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చెంగల వెంకట్రావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రిసీతారాం, అన్ని నియోజకవర్గాల సమన్వయ కర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top