బాబూ బీజేపీపై మీ వైఖరేంటి?

హైదరాబాద్ 12  ఆగస్టు 2013:

  బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? పెట్టుకోరా అనే అంశంపై టీడీపీ అధ్యక్షుడు తన వైఖరిని స్పష్టంచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, ఆకేపాటి అమర్నాథరెడ్డి  డిమాండు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో వారు సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఏ ఎండకాగొడుగు పట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని శ్రీనివాసులు చెప్పారు. అంతవరకూ అంటకాగిన బీజేపీని అంటరానిదంటూ ఫ్రంటును వీడిన చంద్రబాబు లౌకికవాదిగా పోజు కొడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన ఆ మతతత్వ పార్టీపైనే మోజు పెంచుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు.

కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఎన్టీ రామారావు నిర్మించిన టీడీపీని అదే పార్టీకి వత్తాసు పలికేలా చంద్రబాబు తయారుచేశారన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రెండు పర్యాయాలూ ఆ పార్టీ వ్యవహరించిన తీరు దీనినే ప్రతిబింబించిందన్నారు. ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలలో సైతం ఆ పార్టీతో చేతులు కలిపారన్నారు. సీబీఐ కేసులకు జడిసి కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన బాబు ప్రస్తుతం బీజేపీతో కలిసి నడవడానికి ఆత్రపడుతున్నారని చెప్పారు. బీజేపీతో కలిస్తే తప్పేంటని రెండు రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ అడిగిన విషయాన్ని శ్రీనివాసులు గుర్తుచేశారు. వామపక్షాలతో కలిసున్న 1996 -1998 నడుమ చంద్రబాబు బీజేపీని ఎన్నో సందర్భాల్లో అంటరాని పార్టీగా వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు. 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి పవనాలు వీస్తుండడంతో చంద్రబాబు బీజేపీకి మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.  తర్వాత చారిత్రక తప్పిదం చేశానని 2012లో కడపలో జరిగిన ఓ సభలో చెప్పారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోజు చంద్రబాబునాయుడు ఆరోపించారన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే ఆయన ఆరోపణలను ఎవరూ నమ్మలేదన్నారు.

తన కుమార్తె పెళ్ళికి పిలిచే పేరుతో బాలకృష్ణను మోడి దగ్గరకి పంపి, మళ్ళీ బీజేపీకి దగ్గరవడానికి బాబు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. బంధువులను కూడా రాజకీయ అవకాశవాదానికి వినియోగిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణని పేర్కొన్నారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పథకాలతో పోలిస్తే ఏ ప్రభుత్వం  పనికిరాదన్నారు.  మహానేతను తూలనాడుతున్న వారు చరిత్ర హీనులవుతారని హెచ్చరించారు. డాక్టర్ వైయస్ఆర్ ను విభజన ప్రక్రియలోకి లాగితే ప్రజలు క్షమించరని కూడా చెప్పారు.

బీజేపీతో పొత్తు పెంటుకుంటున్నారా లేదా... అనే అంశంపై టీడీపీ స్పష్టతనివ్వాలని అమర్నాథ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో బీజేపీ టీడీపీ ప్రభుత్వం మీద వంద తప్పులని చార్జిషీటు చేసిందనీ, ఆయన దుర్మార్గాలను బయటపెడతామనీ కూడా చెప్పిందన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి, తన మనుషులకు మేలు ఒనగూరేలా వ్యవహరించారని ఆరోపించారు. చంద్రబాబు ఆడిటర్ను ఆర్ బి ఐ డైరెక్టర్‌గా నియమింపజేసుకున్నారన్నారు. 

2004లో ఓటమి అనంతరం పొత్తు వల్లే ఓడిపోయామని బీజేపీ, టీడీపీలు పరస్పరం ఆరోపించుకున్న విషయాన్ని అమర్నాధ రెడ్డి చెప్పారు.  బీజేపీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదమని కూడా బాబు చెప్పారు. సీబీఐ కేసుల భయంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా మెలుగుతున్నారన్నారు.  విప్ జారీ చేసి మరీ కిరణ్ సర్కారును  కాపాడారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పడిపోయుంటే ప్రస్తుత  పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా.. లేక శత్రువులుగానే ఉంటారా అనే విషయమై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అభివృద్ధికి సంకేతమని టీడీపీ నేతలు ఈరోజు చెబుతుండడాన్ని ప్రస్తావిస్తూ ఈ వివరణ ఇప్పుడు అనవసరమన్నారు. మన రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. 

ఇప్పుడు మోడీ టీడీపీకి ఆహ్వానం పలుకుతున్నారనీ చెప్పారు.  నిన్నటి మోడీ ప్రసంగంలో ఎన్టీ రామారావును ప్రశంసలతో ముంచెత్తడం దానినే సూచిస్తోందన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అమర్నాథరెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీతో నడుస్తున్న బాబు ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు కొత్త ఎత్తు వేస్తున్నారని చెప్పారు.  

ఒక్క రోజులో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. విభజనపై తన వైఖరిని చెప్పనే లేదనీ, ఎలా చేయదలుచుకున్నారో కూడా వివరణ లేదనీ తెలిపారు.  తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించినట్లుగా ఈ ప్రక్రియ సాగిందని పేర్కొన్నారు.  మూడు ప్రాంతాల వారికీ న్యాయం చేయమని తమ పార్టీ నేతలు కోరారని అమర్నాథరెడ్డి చెప్పారు.   ప్రస్తుతం చంద్రబాబు చెబుతున్న మాటలను ముందే వెల్లడించి ఉంటే రాష్ట్రం ఇలా ముక్కలయ్యేది కాదన్నారు.

ప్రస్తుత పరిణామాలు టీడీపీ అడుగులు బీజేపీ వైపేనని వెల్లడిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయమై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

Back to Top