మహిళా బాంధవుడు మన రాజశేఖరుడు

() మహిళల అభ్యున్నతికి కృషి  చేసిన ఘనత

() డ్వాక్రా సంఘాల పురోగతికి పథకాలు

() వృద్ధ మ‌హిళ‌ల కోసం పింఛన్ ల పథకం

() ఇళ్ల నిర్మాణంలోనూ పెద్ద పీట


నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా.. ఎక్కడ  ఈ పదబంధాలు కనిపించినా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏ బహిరంగ సభకు వెళ్లినా,  ఏ ప్రాంతంలో పర్యటనకు వచ్చినా తప్పనిసరిగా నోరారా ఆడపడుచుల్ని ఆయన పలకరించేవారు. మహిళా బాంధవుడిగా పేరు తెచ్చుకొన్నారు. తెలుగు నాట మహిళల అభ్యున్నతి కోసం దివంగత మహానేత చేసిన సేవలు ఎనలేనివి. అందుకే ఆడపడుచుల గుండెల్లో ఆయన పెద్దన్నలా నిలిచిపోయారు.


డ్వాక్రా సంఘాలకు పెద్ద పీట

ఇంటికి దీపం ఇల్లాలు అన్న మాటను వైయస్సార్ బాగా నమ్మేవారు. అందుకే ఇంటిలోని మహిళ సంతోషంగా ఉంటే ఇల్లంతా కళకళలాడుతుందని అనుకొనేవారు. ఇంటిని, ఇంటి అవసరాల్ని చక్కబెట్టడంలో మహిళలు చూపించే ప్రతిభను గౌరవిస్తూ ఆర్థిక పురోగతిలో వారిని భాగస్వాముల్ని చేసేందుకు పూనుకొన్నారు. అప్పటికే డ్వాక్రా సంఘాల పేరుతో ఊరూరా మహిళా సాధికార సంఘాలు వేళ్లూనుకొన్నాయి. అయితే వాటిని ప్రోత్సహించే నాథుడు కరవైన పరిస్థితి. అందుకే మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిజంగా మహిళా సాధికారతలో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. రుణాల మంజూరులో నిబంధనల్ని సరళతరం చేశారు. ఫలితంగా పెద్ద ఎత్తున మహిళా సంఘాలు రుణాలు తీసుకొని ఆర్థికంగా పురోగమించసాగాయి. మొదటి విడత పరిపాలనలోనే ఏకంగా 16, 535 కోట్ల రూపాయిల మేర రుణాల్ని మహిళలకు అందించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండో విడత పరిపాలన చేపట్టాక ఈ పథకం మరింత పురోగమించింది.


ఆర్థిక స్వావలంబన

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి కోరుకొనేవారు. అందుకోసం మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇతోధికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించేవారు. కాన్ఫెడరేషన్ ఆప్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ పేరుతో ఒక సంఘంగా ఏర్పడేట్లు చేశారు. కోవా అనే ఈ విభాగానికి పారిశ్రామిక యూనిట్ల స్థాపన కోసం ఎక్కడికక్కడ స్థలాలు కేటాయించారు. ఆయా సంఘాల ప్రతినిధులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించేవారు. నగరాల్లో పరిస్థితి ఇదయితే, గ్రామాల్లో మహిళలకు అందుబాటులోకి సూక్ష్మ రుణాల్ని తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సూక్ష్మ రుణాలు అందుకొనే వారిలో దాదాపు 42 శాతం మంది తెలుగువారు నిలిచారు. దీన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున సాగించారో అర్థం అవుతుంది.


ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు

ప్రతీ ఇంట్లో ఆడపిల్లలు తప్పకుండా చదువుకోవాలని మహానేత కలలు కనేవారు. ఇందుకోసం ఇతోధికంగా ప్రోత్సహించేవారు. ఆడపిల్లలు చదువుకొనేందుకు వెళ్లేందుకు గాను ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి అయినా చదువుకోవటం వీలైంది. దగ్గరగా ఉండే స్కూల్స్ కు వెళ్లేందుకు సైకిళ్లను పంపిణీ చేయించారు. బడి మానేసిన ఆడపిల్లల్ని తిరిగి బడిలోకి రప్పించేందుకు వినూత్నంగా బడి బాట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని కింద ప్రతీ గ్రామంలోనూ ప్రభుత్వ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆడపిల్లలు బడిలో చేరే విధంగా చొరవ తీసుకోవటం జరిగింది. మైనార్టీ వర్గాల ఆడపిల్లల్లో విద్య పట్ల ఆకర్షణ పెంచేందుకు ల్యాప్ టాప్ లు వంటివి సరఫరా చేయించారు. ఫీజు రీ యింబర్స్ మెంట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షల మంది విద్యార్థినులకు ప్రయోజనం దక్కింది.


అభయహస్తం

ఇందిరా క్రాంతి పథం పేరుతో వైయస్సార్ ఒక కొత్త తరహా జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారు. అంటే పేద మహిళలకు బీమా సదుపాయం కల్పిస్తారన్న మాట. దీంతో 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రతీ నెలా పింఛన్ అందిస్తారు. నెలకు రూ. 500 నుంచి రూ.2,200 దాకా పింఛన్ నేరుగా అందుతుంది. అంతే కాకుండా కుటుంబసభ్యులకు ఉపకార వేతనాలు, ఉచిత బీమా వంటివి ఇందులో కలిసి ఉంటాయి. ఈ పథకం ప్రారంభంలో తక్కువ స్పందన కనిపించినా, తర్వాత కాలంలో వేగంగా విస్తరించింది. కోటీ పాతిక లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది కలిగిందంటే దీని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఆసరా లేని నిరుపేద మహిళలకు తినేందుకు కాస్తంత భోజనం దొరికిందంటే అది రాజశేఖరుని చలవే అనుకోవాలి.


పరోక్ష ప్రయోజనం

గ్రామాల్లోని మహిళల్ని ఆదుకొనేందుకు వివిధ పథకాల్లో వారికి పెద్ద పీట వేసేవారు. మహిళల పేరిట రేషన్ కార్డులను ప్రోత్సహించారు. విరివిగా రేషన్ కార్డుల్ని అందించారు. ఇది నేరుగా మహిళల్ని ఉద్దేశించింది కాకపోయినా ఇంటిల్లి పాదికి నిత్యావసర వస్తువులు తెచ్చుకొనే ఏర్పాటు చేయటం మహిళలకు సహకరించేదే కదా. అటు గ్యాస్ సిలిండర్ మీద కేంద్రం భారం వేసినప్పుడు వైయస్సార్ ముందుకు వచ్చి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తుందని ప్రకటించారు. చేతి వ్రత్తులు, హస్త కళల్లో నిమగ్నమైన మహిళలకు తేలికపాటి రుణాలు అందించే వెసులుబాటు కల్పించారు. చేనేత రుణాల్ని మాఫీ చేసినప్పుడు లక్షల మంది మహిళల కళ్లలో వెలుగులు నిండాయి. పశు క్రాంతి పథకం, గొర్రెల బీమా పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటిలో మహిళలకు పెద్ద పీట దక్కింది.

మహిళల మాట సత్యవాక్కు

ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలన తీరు గురించి ప్రజల అభిప్రాయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొనేవారు. ఇందు కోసం వైయస్సార్ ఎక్కువగా ఆడపడుచుల మీద ఆధార పడేవారు. బహిరంగ సభలకు వెళ్లినప్పుడు, ప్రజల్లోకి వెళ్లినప్పుడు మహిళల్ని వేదికల మీదకు ఆహ్వానించేవారు. వివిధ పథకాల అమలు మీద, పరిపాలన తీరు తెన్నుల మీద మాట్లాడించేవారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేవారు. అందుకు అనుగుణంగా పథకాల అమలు లో అప్పటికప్పుడు మార్పులు చేపట్టేవారు. గ్రామాల్లో విప్లవాత్మకమైన మార్పులకు మహిళలు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారభూతమైందంటే అతిశయోక్తి కాదు.

మహిళా నాయకత్వానికి పెద్ద పీట

ఇటు రాజకీ యాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున రాణించాలని వైయస్సార్ కోరుకొనేవారు. అందుకే ఆయన మంత్రిమండలిలో ఆరుగురు మహిళలకు మంత్రిపదవులు ఇచ్చారు. అప్పటి దాకా స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణ అభివ్రద్ధి వంటి స్వల్ప ప్రాధాన్య శాఖలు కేటాయించేవారు. కానీ వైయస్సార్ మాత్రం తన మంత్రిమండలిలో హోమ్ శాఖ, పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు వంటి ప్రధాన మంత్రిత్వ శాఖల్ని మహిళలకు కేటాయించారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి హోమ్ మంత్రిగా మహిళను నియమించిన ఘనత ఆయనకు దక్కుతుంది. అటు బ్యూరోక్రసీలో, స్థానిక స్వపరిపాలనలో  మహిళలను ఎక్కువగా ప్రోత్సహించేవారు. 

        కోటిమంది మహిళల్ని లక్షాధికారుల్ని చేయటమే నా ధ్యేయం అని దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటుండేవారు. దీన్ని బట్టి మహిళా సాధికారత కు ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారో అర్థం అవుతుంది. అందుకే ఆయన మహిళా బాంధవుడు అయ్యారు.

 

Back to Top