కార్మిక వ్యతిరేక ప్రభుత్వమిది


– వైయస్‌ఆర్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతంరెడ్డి
– వేతనాలు పెంచడంతో ప్రభుత్వం నాటకాలు
విజయవాడ: ఏపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ గౌతంరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారని, విద్యుత్‌ రంగంలో  25 వేల మంది కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. మెటర్నటి లీవ్‌లో ఉన్న కార్మికులకు పూర్తి వేతనం ఇస్తామన్న చంద్రబాబు మాట తప్పారన్నారు. విద్యుత్‌ రంగంలో పని చేస్తున్న వారికి 60 రోజులు మాత్రమే ఇస్తున్నారని, మిగతా రంగాల్లో పని చేసే వారు ఉద్యోగులు కాదా అని నిలదీశారు. కార్మికుల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. విద్యుత్‌ కార్మికులకు ఎందుకు వేతనాలు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. వేతనాలు పెంచడంలో ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు.  యాక్ట్‌ను సవరించాలని ఆయన డిమాండు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. దుర్గా గుడి వద్ద కేశ ఖండన చేస్తున్న క్షురకుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారని, అయితే ఇవాళ ఉన్న జాబులను తొలగిస్తున్నారని విమర్శించారు. ఆదర్శ రైతులు, ఐకేపీ ఉద్యోగులు, ఉపాధి హామీ ఫీల్డ్‌ ఆఫీసర్లను తొలగించారని, ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆందోళ న వ్యక్తం చేశారు. బాబు గారి అబ్బాయికి మాత్రమే జాబు వచ్చిందని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చాయని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కడప జిల్లాలో ఒకేసారి 300 మంది కార్మికులను తొలగించారని, కార్మికులు ఉద్యమించడంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ఆదర్శమిత్రల నియామకం పచ్చి బూటకమని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు వీడకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

 

తాజా వీడియోలు

Back to Top