మహనీయుని మహావర్థంతి..!

ప్రియతమ నేతకు ప్రజల ఘన నివాళి..!
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన చిరస్మరణీయుడు...స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి

చెరగని సంతకం రాజన్న..!
ప్రజానాయకుడు, పేదల పెన్నిది, తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న మహనీయుడు స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి . చెరగని చిరునవ్వుతో ప్రజల మనసు గెలిచిన లీడర్. నాయకుడు అంటే రాజశేఖరుడు...రాజశేఖరుడు అంటేనే నాయకుడు అన్నవిధంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరెందరో నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.  అలాంటి ప్రజాద‌రణ కలిగిన ఓ మంచినాయకుడు ఒక్క రాజన్న మాత్రమే.   రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించి పేదప్రజల ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడు అయ్యాడు. ఆమహానేత ఆరవ వర్ధంతిని వైఎస్సార్సీపీ నేతలు, తెలుగు రాష్ట్రాల  ప్రజలు ఇవాళ  జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 2 వైఎస్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 

ఎందరికో ఆదర్శప్రాయుడు..!
ఆయన ఓ మాస్టారు... ఆయన ఓ డాక్టరు...    ఆయన విశ్వసనీయతకు మారుపేరు... ఆయనే ఓ ధైర్యం.. ఆయనే ఓ నమ్మకం.. ఆయన ఓ శ్వాస.. ఆశ! ఆయన ఓ తోడు.. నీడ! ఆయన ఓ అన్నదాత.. అందరి ప్రియతమ నేత! మట్టి విలువ తెలుసుకున్న జననేత! మనిషిగా పుట్టిన ఆయన అందనంత ఎత్తుకు ఎదిగారు.. అందని లోకాలకు వెళ్లారు. అందుకే ప్రజలు వైఎస్ అనే రెండక్షరాల పేరును తమ గుండెల నిండా నింపుకొన్నారు. ఆయననే తలచుకుంటూ జీవిస్తున్నారు. మళ్లీ పుడతాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎడుగురి సందింటి రాజశేఖరరెడ్డి మనకు దూరమై శారీరకంగా ఆరు ఏళ్లు అవుతున్నా ఆయన స్మృతులను మాత్రం ఇక్కడే విడిచి వెళ్లారు.

మాలోనే ఉన్నావు రాజన్నా..!
సంక్షేమ రథ సారధి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మాట ఇచ్చారంటే మడమ తిప్పని వ్యక్తిత్వం ఆయనది. అధికారంలోకి వచ్చిన వెంటనే  ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్  ఫైల్ మీద‌ మొట్టమొదటి సంతకం చేశారు. ఆతర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి కుటుంబాల్లో వెలుగు నింపారు. సాధ్యం కాద‌నుకొన్న‌ పనులెన్నో ఆయన సుసాధ్యం చేశారు. రాజన్న రాజ్యంలో రైతు రారాజుగా వెలుగొందాడు. సకాలంలో  వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడాయి. మహిళలకు ఎంతో అభయం కల్పించారు. ఆరోగ్యశ్రీతో ప్రాణంపోసి ప్రాణదాత అయ్యారు.  కార్పొరేట్ కళాశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించి  విద్యార్థులకు విద్యాదాత అయ్యారు. పేదలకు ఇళ్లు.. భూములు పంచిపెట్టిన నేత. మహిళలను లక్షాధికారులను చేసిన ఘనత ఆయనకే సొంతం. కోట్లమంది జీవితాల్లో వెలుగు నింపి...చిరునవ్వును చిరకాల స్మృతిగా మిగిల్చి వెళ్లిన మంచితనం కలబోసిన మహానేతకు జోహర్లు. 
Back to Top