అభివృద్ధికి చిరునామా వైయస్సార్

  • తెలుగు ప్రజల పెన్నిధి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి
  • తండ్రీ, గురువు, దైవం అన్నీ కలబోసిన నేత వైయస్సార్
  • ప్రతి ఇంటికీ తన పథకాలతో చేరువై దేవుడిగా కొలువైన మహనీయుడు
  • మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం వైయస్సార్ సొంతం
  • ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, అనురాగాలకు పెట్టింది పేరు
  • వైయస్సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కోట్లాది గుండెలు
వైయస్సార్...యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం. నాయకత్వానికి వన్నెతెచ్చిన దార్శనికుడు . గొప్ప నాయకుడు . గొప్ప మానవతావాది. తండ్రీ, గురువు, దైవం అన్నీ కలబోసిన మహనీయుడు . తెలుగు ప్రజల గుండె సవ్వడి. ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న మహానాయకుడు వైయస్సార్. ప్రాణదాత, విద్యాదాత, రైతుబాంధవుడు . తెలుగు ప్రజల పెన్నిధి.  ఎనలేని సంక్షేమ పథకాలను అందించి తెలుగు ప్రజల చేత ముద్దుగా రాజన్నా అని పిలుపించుకుంటూ  వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నదివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

ప్రజా సంక్షేమమే పరామవధిగా ప్రజల మొములో చిరునవ్వు చిందించడమే ధ్యేయంగా పాలన అందించిన మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఓటమి ఎరుగని ధీరుడు. విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీకి నిలువుటద్దం. చెదరని చిరునవ్వు, తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు .  ప్రేమ, నమ్మకం, ఆప్యాయత-అనురాగాలకు పెట్టింది పేరు వైయస్సార్.  మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వం వైయస్సార్ సొంతం.  స్వయం కృషితో ఎదిగారు. ప్రజల కోసమే పనిచేశారు. పెద్దన్నగా అన్నీ తానై ఆదుకున్నారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పగలు, రేయి అనక శ్రమించి జనం మెచ్చిన నాయకుడయ్యారు. 

పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్న గొప్ప నాయకుడు వైయస్సార్. దార్శనికతతో తెలుగు ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారు. తిరుగులేని ప్రజాభిమానాన్ని సంపాదించి ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా మిగిలారు. అందుకే ఆ మహానేత మనకు భౌతికంగా దూరమైన ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతీ గుండెలో కొలువై ఉన్నాడు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎప్పటికీ మా గుండెల్లో కొలువై ఉంటావు రాజన్న అని వైయస్సార్ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. 

తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇవ్వాలో.. వారి కోర్కెలను ఎలా తీర్చాలో చేసి చూపించిన వ్యక్తి వైయస్సార్. డాక్టర్ కావాలనే తన తల్లి ఆశయాన్ని .. రాజకీయ నాయకుడిగా ఎదగాలనే తన తండ్రి కోర్కెను తీర్చి ఆదర్శంగా నిలిచారు . ‘‘ ఏ వృత్తినైనా స్వీకరించు కానీ... ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు అవసరం’’ అన్న తన గురువు  వెంకటప్ప సారు చెప్పిన మాటలను చిన్నతనంలోనే మనసులో ముద్రించుకున్న వైయస్సార్...రాజకీయాల ద్వారానే అది సాధ్యం అని నమ్మి ఇటువైపుగా అడుగులు వేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ.. వారి బాగోగులు చూస్తూ పెద్దకొడుకు పాత్రను పోషించారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో  తనదైన ముద్ర వేసుకున్నారు. 

ప్రాణం పోసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ
‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ ఈ పేరు దేశంలోనే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది.. నిరుపేదల సంజీవనిగా కొనసాగుతూనే ఉంది. వైయస్సార్ స్వయాన డాక్టర్ కాబట్టి పేదల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీస్తుండేవారు. కార్పొరేట్ వైద్యం కాదు కదా.. చిన్న ఆస్పత్రులకు వెళ్లలేక.. డబ్బులు లేక ఇంటి వద్దే చనిపోతుండడం చూసి చలించి పోయే వారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఇది నిజంగా పేదల సంజీవనే. చిన్న చిన్న జబ్బులతోపాటు పెద్ద జబ్బులకు కూడా ఉచిత వైద్యం అందించే ఏర్పాటు ఆరోగ్యశ్రీ ద్వారా చేశారు వైయస్సార్. దాదాపు 1000 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అప్లై చేసుకుంటే 12 గంటల్లోనే అనుమతులు ఇచ్చి ఉచితంగా ఆపరేషన్లు చేయడమే కాదు.. అందుకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు వారిని ఇంటికి చేర్చేంత వరకు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించింది. దీంతో ప్రజలు వైయస్సార్ ను  దేవుడిలాగా చూడడం మొదలు పెట్టారు. అప్పుడు ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా నేటికి  పేదలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందుతున్నారు. అనారోగ్య బాధితులు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖరరెడ్డి వారికి లేఖ రాసేవారు. అంతటి ప్రేమ, అభిమానం పేదలపై చూపించేవారు . అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామిగా పేరుపొందుతున్నాయి 108 అంబులెన్స్లు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాదాపు 5, 10 నిమిషాల్లో సంఘటనా స్థలాలనికి కుయ్..కుయ్..కుయ్ అంటూ వచ్చి వారిని ఆస్పత్రులకు చేర్చుతున్నాయి.  చిన్న చిన్న రోగాలకు వైద్య సలహాలు అందించేందకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా  104 ఉచిత కాల్ సెంటర్ , నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనాలను ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డిదే. 
 
రైతులకు ఊపిరిలూదిన ఉచిత విద్యుత్
రైతులపై చంద్రబాబు ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తున్న రోజులవి. విద్యుత్  చార్జీలు కట్టలేదని రైతుల మోటార్లు ఎత్తుకెళ్లడం, రైతులను జైల్లో పెట్టి కొట్టించడం వంటివి చేస్తుండేవారు. విద్యుత్ చార్జీల పెంపుపై దాదాపు మూడు నెలలపాటు ఉద్యమం సాగింది.  2000 సంవత్సరం ఆగస్టు 28న రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బడుగు, బలహీన, పేద వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ నుంచి శాసన సభ ముట్టడికి బయలు దేరగా అప్పటి సర్కార్ బషీర్ బాగ్ వద్ద పోలీసులు ముప్పేట దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపగా ముగ్గురుచనిపోయారు. ఈ సంఘటనపై వైయస్సార్ చలించిపోయారు. అసలే పవర్ కట్.. ఆపై విద్యుత్ చార్జీల మోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు వైయస్సార్ ను కలిచివేసింది. అలాంటి నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని బయట పెట్టారు వైయస్సార్.  తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.  ముఖ్యమంత్రి అయ్యాక ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసినా... ఉచిత విద్యుత్ అమలు సాధ్యమేనా అని కాంగ్రెస్ అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేసినా... మాట తప్పలేదు.. మడిమ తిప్పలేదు వైయస్సార్. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలిసంతకం చేస్తానని చెప్పిన మహానేత  2004 మే 22వ తేదీ ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు. ఆ ఉచిత విద్యుత్ రైతులకు ఊపిరిలూదింది. నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడం, పంటలు పండేటట్లు చేసిన వైయస్ రాజశేఖరరెడ్డిని దేవుడిలాగా చూసుకున్నారు రైతులు. 
 
అపర భగీరథుడు వైయస్సార్
భూములు అన్నా.. నీళ్లు అన్నా వైయస్సార్ కు ప్రాణం. రైతును రాజుగా నిలబెట్టాలని తపన పడేవారు. ఎండిన భూములను, బీడు భూములను సశ్య శ్యామలం చేయాలని నిత్యం కలలగనేవారు. పంటలు పండక అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను చూసి చలించిపోయేవారు. తన పాదయాత్ర ద్వారా  రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న  పరిస్థితులను పరిణతితో అర్థం చేసుకున్నారు. వారి సమస్యలకు స్పందించి  నీళ్ల కోసం పోరాటాలు చేశారు. ఆత్మహత్యలు మానాలని, సమస్యలకు అది పరిష్కారం కాదని రైతులకు భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను గౌరవ ప్రదమైన స్థానంలోకూర్చోబెట్టాలంటే ప్రాజెక్టుల నిర్మాణమే సరైనదని వైయస్సార్ భావించారు.  ముఖ్యమంత్రి అయ్యాక ‘‘అడుక్కుతినైనా... అప్పుచేసైనా.. రాష్ట్రంలో జలయజ్ఞం పథకం పూర్తి  చేస్తాం.. ప్రాజెక్టులను నిర్మిస్తాం... గ్రామీణ ప్రాంతాల్లో సేద్యపు నీటి సౌకర్యాలకు పెద్ద పీట వేసి దాదాపు కోటి ఎకరాలకు సేద్యపు నీటి వసతి కల్పిస్తాం’’ అని వైయస్సార్ అన్నారంటే ఆయనకు రైతులపై ఎంతో ప్రేమ ఉందో చెప్పనవరం లేదు.  జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు 86. భారీ తరహా నీటి ప్రాజెక్టులు 44 కాగా మధ్య రతహా నీటి ప్రాజెక్టులు 30. భూమి కోతను నివారించేందుకు నదీగట్టు ప్రాంతాలను పట్టిష్టపరిచే పథకాలు నాలుగు. ఆధునికీకరణ ప్రాజెక్టులు ఎనిమిది. ఇందులో పూర్తి చేసినవి నాలుగు మధ్యతరహా, నాలుగు భారీ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. 74 నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా చేపట్టని విధంగా రాష్ట్రంలో 52 వేల కోట్లకు పైగా ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టారంటే అది వైయస్సార్ ఘనతే. 
 
 అన్నదాత సుఖీభవ!
 కిలో బియ్యం రూ.15 నుంచి రూ.20లు అమ్ముతున్న రోజులవి. పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్నా ఆలోచన చేయాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక  పేదవాళ్లకు కిలో బియ్యం రూ.2లకే అందించే ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి నష్టం వస్తుందని అధికారులు వాదిస్తున్నా... బడ్జెట్ లేదని లెక్కలు చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. పేదవాళ్లకు కనీస తిండి విషయంలో ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో కిలో బియ్యం రూ.2లకే పథకాన్ని ప్రవేశపెట్టారు. కడుపునిండా అన్నం పెట్టారు. పేదవాళ్ల ఆకలి తీర్చారు. అందుకు వైయస్ఆర్ ను  అందరూ అన్నదాత సుఖీభవ! అంటూ ఆశీర్వదించారు. పేదవాళ్లకు ఏదైనా చేయాల్సి వస్తే వెనకా ముందూ ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసే ధైర్యం కలిగిన ఏకైక ముఖ్యమంత్రి  వైయస్సార్. 
 
 ప్రతి కుటుంబానికి ఇల్లు..!
చాలా మందికి కలగా మిగిలిపోయిన సొంతిటి కలను నిజం చేశారు వైయస్సార్. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సొంతిల్లు నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్లి బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కూడా సొంతింటి కలను సాకారం చేశారు. ‘‘ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ’’ పథకాలను ప్రవేశపెట్టి ఇల్లులేని చాలా మందిని సొంతింటి వారిని చేశారు. కనీస అవసరాలైన కూడు..గూడును కల్పించారు. ఎవరు వద్దంటున్నా పట్టించుకోకుండా ముందుకెళ్లి అందరి మన్ననలు పొందారు. 
 
 ఫీజు రీయింబర్స్ మెంట్ తో ఉన్నత చదువులు
 వైయస్సార్  ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. చాలా మంది యువకులు స్థానికంగా పనులకు వెళ్లడం గమనించారు. ఆ పనులు కూడా సరిగా ఉండేవి కావు. వచ్చిన డబ్బులతోనే కాలం గడిపేవారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు తమ వద్ద డబ్బులు లేవని వైయస్సార్ తో చాలా మంది యువకులు వారి గోడును చెప్పుకున్నారు. డబ్బులు లేని చదువు మధ్యలో ఆగకూడదని వైయస్సార్ వారికి భరోసా ఇచ్చి, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఓ నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడిన ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు ఊరట కలిగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైయస్సార్ అవకాశం కల్పించారు. అంతేకాదు డబ్బు లేదని చదువు నిరాకరించవద్దని విద్యా సంస్థలకు, అధికారులకు స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థులకు సైతం ఉన్నత చదువులు అందించే లక్ష్యంలో భాగంగా వారి కోసం ట్రిబుల్ ఐటీలను స్థాపించారు. అన్నీ ప్రభుత్వమే భరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఎంతోమంది ఇంజినీర్లు, డాక్టర్లుగా మారారు. వైయస్సార్ మరణించిన తర్వాత ఇప్పుడు ఆ పథకం నీరుగారి పోయింది. ఆ పథకాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఆ మహానుభావుడు ఉంటే ఇలా జరిగేది కాదంటూ చాలా మంది విద్యార్థులు బాధపడుతుండడం గమనార్హం. 
 
 వైయస్ వరం.. పావల వడ్డీకే రుణం
వైయస్ రాజశేఖర్ రెడ్డికి మహిళలపై అపారమైన గౌరవం ఉండేది. ప్రతి మహిళను తన తోబుట్టువులా భావించారు గనుకే రాజన్నగా వారి హృదయాల్లో గూడుకట్టుకున్నారు.  వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చాలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వాటిల్లో  ‘ఇందిరా క్రాంతి పథకం’ ఒకటి.  మహిళలను లక్షాధికారులను చేయాలనే ఏకైక సంకల్పంతో చేసిన సృష్టే ఈ పావల వడ్డీకే రుణం.  ఇందిరా క్రాంతి పథకం ద్వారా  రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వైయస్సార్  స్వయం సహాయక సంఘాల మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇప్పించి వాటితో వివిధ వ్యాపారాలు చేసుకునేలా వారిని పోత్సహించారు. తమ కాళ్లపై తాము నిలబడేలా మహిళా సాధికారత దిశగా వైయస్ కృషి చేశారు. ఐదేళ్ల కాలంలోనే సుమారు 85 లక్షల మంది మహిళలకు ఏడు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేందుకు  ఎంతో కృషి చేశారు. రెండు, మూడు రూపాయల వడ్డీ నుంచి పావల వడ్డీకే రుణాలు వస్తుండడంతో  మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి వైయస్సార్  ఓ పెద్దన్నయ్యలాగా మహిళలకు విముక్తి కల్పించారు. 
 
మహిళలకు అభయం.. రాజన్న సాహసం
వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మరో సాహసం ‘అభయ హస్తం’. అసంఘటిత రంగంలోని మహిళలకు కూడా వృద్ధాప్యంలో ఆసరగా నిలిచే పింఛన్ పథకానికి  శ్రీకారం చుట్టారు. ‘అభయ హస్తం’ పేరుతో మహిళల్లో ధైర్యం నింపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న నిరుపేద మహిళలు నెల నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే ప్రభుత్వం కూడా మరికొంత మొత్తాన్ని వేసి 60 ఏళ్లు దాటిన తర్వాత వారికి నెలా నెలా పింఛన్ అందేలా ఏర్పాటు చేయడమే అభయ హస్తం లక్ష్యం. ఇది అనతి కాలంలోనే జనాల్లోకి వెళ్లి మంచి ఆదరణ పొందింది. మహిళల్లో చైతన్యం తెచ్చింది. 
 
 పింఛన్.. ధైర్యమిచ్చెన్!
 పాదయాత్రలో తెలుసుకున్న  సమస్యలకు చెక్ పెట్టాలనుకున్నాడు... ఎవరూ లేని వారికి అన్నీ తానై ఉండాలనుకున్నాడు... అన్నట్లుగానే ఆత్మబంధువుగా నిలిచాడు వైయస్సార్ . వృద్ధులు, వితంతువులు, చేనేతలు, వికలాంగులులకు ప్రతి నెలా ఠంచన్గా పింఛన్ రూపంలో కొంత మొత్తాన్ని వారికి ఇచ్చే ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసినా కూడా అలాంటి వారిని ఆదుకోవాలనే ధృడ సంకల్పంతో ముందుకెళ్లారు. వైయస్సార్ ఏదైనా ఒకసారి నిర్ణయం తీసుకున్నా... పేదవారికి మన ద్వారా న్యాయం జరుగుతుందని తెలిసినా వెనక్కి వెళ్లే వ్యక్తి కాదు. అలా ఆదరణ కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్న దాదాపు 70 లక్షల మందికి (ఉమ్మడి రాష్ట్రంలో) పింఛన్ పథకాన్ని విస్తరించిన ఘనత వైయస్సార్ ది. 
 
 ‘ఇందిర ప్రభ’..పేదల జీవితాల్లో శోభ!
 రాష్ట్రంలోని పేద ప్రజలకు ‘ఇందిర ప్రభ’పేరుతో భూములు పంపిణీ చేశారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 6.5 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిజనుల భూ పంపిణీ చట్టాన్ని దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసి మొత్తం 13 లక్షల ఎకరాలు భూమిని పంపిణీ చేశారు. 
 
 ఎన్నని చెప్పాలి... ఏవని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే వైయస్సార్  చేసిన పథకాలు చాంతాడంత ఉన్నాయి.
  •  పశుక్రాంతి పథకం ద్వారా ఎక్కువ సబ్సీడీతో మేలు రకం పాడి పశువులను పంపిణీ చేశారు.
  •  జీవ క్రాంతి పథకం ద్వారా గొర్రెలు, పొట్టేళ్ల పంపిణీ చేశారు. అంతేకాకుండా గొర్రెల కాపరులకు, గొర్రెలకు బీమా కల్పించారు. 
  • ఇందిరా జీవిత బీమా ద్వారా  వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించారు
  •  రాజీవ్ యువశక్తి, రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకాల ద్వారా చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించారు. రాష్ట్ర, దేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు సేవ చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన వైయస్సార్  రుణం ఎప్పటికీ తీరనిది... తీర్చుకోలేనిది. వైయస్సార్ పథకాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారంటే అది వైయస్సార్ చలవేననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహా రాజువయ్యా..మహా రాజువయ్యా
Back to Top