డీఈఓపై పరువునష్టం దావా వేస్తా

రాజకీయ కక్షతో మహిళా ప్రజాప్రతినిధిని కించపరిచారు
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
నగరిలో ఘనంగా ప్రారంభమైన వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌

చిత్తూరు: ఒక మహిళా ప్రజాప్రతినిధిని అవమానపరిచిన చిత్తూరు జిల్లా విద్యాశాఖా అధికారిపై పరువునష్టం దావా వేస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మల్యే ఆర్కే రోజా అన్నారు. 21వ తేదీన క్రికెట్‌ టోర్నమెంట్‌కు డ్రిల్‌ మాస్టర్లను ఇవ్వమని కలెక్టర్‌ అర్జీ పెడితే.. ఆయన 11 మంది పీఈటీలను మంజూరు చేశారని, తెల్లవారే సరికి డీఈఓ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఘనంగా ప్రారంభమైంది. టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి పార్థసారధి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్‌కు పీఈటీలు కావాలని కలెక్టర్‌ను కోరితే.. ఆయన మంజూరు చేశారని, తెల్లవారే సరికి డీఈఓ వారంతా సెలవుల్లో ఉన్నట్లుగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయ కక్షతో చేసిన చర్యకు కోర్టుకు వెళ్తానని, క్రీడాకారులను, ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యఅతిథులను నిరుత్సాహ పరిచినందుకు కోర్టుకు వెళ్తానన్నారు. జరిగిన నష్టాన్ని డీఈఓ నుంచి వసూలు చేసుకుంటానన్నారు.
Back to Top