'డిఫాల్టర్‌ నిబంధన ఎత్తివేతపై న్యాయపోరాటం'

అనంతపురం, 15 జూన్‌ 2013:

అనంతపురం డిసిసిబి ఎన్నికల్లో టిడిపి - కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బి. గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇతర జిల్లాల్లో డిఫాల్టర్‌ (రుణాలు ఎగవేసిన) నిబంధనను అమలుచేసి అనంతపురం జిల్లాకు వచ్చేసరికి దాన్నిఎత్తివేయడం అప్రజాస్వామికమని వారు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనంతపురం డిసిసిబి ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్  పార్టీ గెలుస్తుందన్న భయంతో డిఫాల్టర్‌ నిబంధన ఎత్తివేశారని వారు వ్యాఖ్యానించారు. హైకోర్టును కూడా మోసం చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని గుర్నాథరెడ్డి, రామచంద్రారెడ్డి ఆరోపించారు.  డిఫాల్టర్‌ నిబంధనతో ఎన్నిక నిర్వహించకపోతే న్యాయపోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్టర్‌ సంఘాలకు ఓటు హక్కు లేకుండా డిసిసిబి, డిసిఎంఎస్‌ చైర్మన్ల ఎన్నికలను పూర్తిచేసిన ప్రభుత్వం.. అనంతపురం జిల్లా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడమేమిటని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్నిసంఘాలకూ ఓటు హక్కు కల్పిస్తూ డిసిసిబి, డిసిఎంఎస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ప్రభుత్వం జీవో 839ను జారీ చేసింది. హైకోర్టు పనివేళలు ముగిశాక వ్యూహాత్మకంగా ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ చీకటి జీవోపై విపక్షాల మద్దతుదారులు హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనుండడం గమనార్హం.

Back to Top