ఢిల్లీకి వైయస్ఆర్ కాంగ్రెస్ బృందం: వాసిరెడ్డి

హైదరాబాద్ 26 ఆగస్టు 2013:

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరిని  రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు వివరించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆధ్వర్యంలో పార్టీ బృందం మంగళవారం ఢిల్లీ వెడుతుందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్య నేతలు ఈ బృందంలో ఉంటారని తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే ఇబ్బందులను రాష్ట్రపతి, ప్రధాన మంత్రికీ వివరిస్తామనీ, పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు, చేసిన ఆందోళనలు, గుంటూరులో శ్రీమతి విజయమ్మ నిరవధిక దీక్ష భగ్నం సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు. ప్రస్తుతం జైలులో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన నిరవధిక, తదితర అంశాలను వారి దృష్టికి తెస్తామనీ చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఎందుకు లేచింది, విభజన కారణంగా ఏ పరిస్థితులు ఎదురవుతాయీ కూడా తెలియజేస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేకూర్చేలా ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోవడం మాని ఏకపక్షంగా వ్యవహరించిన తీరును వారి దృష్టికి తీసుకెడుతామన్నారు. దీనివల్ల రాష్ట్రం అగ్ని గుండంగా మారిన విషయాన్నీ వివరిస్తామన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఈ బృందం రాష్ట్రపతినీ, ప్రధాన మంత్రినీ కలిసే అవకాశముందని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్బంధంలో ఉండి కూడా నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక ప్రాంతానికి విద్రోహ పార్టీలుగా మారిపోయాయనీ, కాంగ్రెస్ పార్టీ ఓ కేకును కోసినట్లు రాష్ట్రాన్ని కోసేయాలని చూస్తొందనీ మండిపడ్డారు.  ఇందుకు చంద్రబాబు చాకులాగ ఉపయోగపడ్డారని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం ఎలా జరగాలీ, నీటి వివాదాలకూ, హైదరాబాద్ అంశానికీ పరిష్కారమెలా అనే విషయాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ఆరోపించారు. ఈ అంశాలపై తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాము అనునిత్యం ప్రశ్నిస్తూనే ఉన్న విషయాన్ని వాసిరెడ్డి గుర్తుచేశారు. ఈ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ గానీ, కేంద్రం గానీ ప్రయత్నించడం లేదన్నారు. అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఎలా ఉండాలనే అంశాన్ని కిందిస్థాయిలో చర్చించకుండా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. మేం ఏం చెబితే అది అమలుకావాలన్న నిరంకుశ ధోరణిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పారు. విభజన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ కూడా ఏకవాక్య తీర్మానాన్ని చేసిందన్నారు. తమ పార్టీ మొదటినుంచి రాష్ట్ర సమస్యలపై నిబద్ధతతో వ్యవహరిస్తోందనీ, ఆలోచిస్తోందనీ వివరించారు.

Back to Top