వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ వాయిదా

హైదరాబాద్, 4 జూలై 2013:

ఈ నెల 8న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో నిర్వహించాల్సిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీని వాయిదా వేసినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ తెలిపారు. ప్లీనరీ ఎప్పుడు నిర్వహించేదీ తేదీ నిర్ణయించిన తరువాత ప్రకటిస్తామని చెప్పారు.

అలాగే.. జూలై 8వ తేదీన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గతంలో నిర్వహించిన మాదిరిగానే రక్తదానం, అన్నదానం లాంటి అన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు, వైయస్‌ అభిమానులకు మైసూరారెడ్డి విజ్ఞప్తి చేశారు. వైయస్‌ఆర్‌ జన్మదినోత్సవం రోజున ఇంతకు ముందు ప్లీనరీ నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ సారి ఆ రోజు ప్లీనరీ వాయిదా పడినందున  మహానేత జయంతి సందర్భంగా ఆ రోజున ప్రతి ఏటా నిర్వహించే అన్ని కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర యధావిధిగా కొనసాగుతుందని మైసూరారెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికల షెడ్యూళ్ళు వరుసపెట్టి వస్తున్నందున ప్లీనరీ ఎప్పుడు నిర్వహించడానికి వీలవుతుందో చూసుకుని త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజు సెప్టెంబర్‌ 2వ తేదీన నిర్వహించే ఆలోచన ఉందా అన్న ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరా సమాధానం ఇస్తూ.. చూస్తామని.. ఎన్నికల నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు వీలవుతుందో ఆ రోజుకు ప్లీనరీ తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పైలాన్‌ ఆవిష్కరించాలని, పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు మరో ప్రశ్నకు మైసూరారెడ్డి బదులిచ్చారు.

Back to Top