ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణాలువిచ్చలవిడిగా మద్యం తాగించేస్తున్నారుముఖ్యమంత్రి, లోకేష్,మంత్రులు,ఎమ్మెల్యేలకు మద్యం ముడుపులుసొసైటీలో ఆడవాళ్లు తిరిగే పరిస్థితి లేదుచదువుకునే పిల్లలు దారితప్పుతున్నారుమృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలని ..ప్రభుత్వానికి వైఎస్ జగన్ డిమాండ్
విజయవాడః ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబసభ్యులు తమ కన్నీటి ఆవేదనను వైఎస్ జగన్ కు చెప్పుకొని బోరున విలపించారు. ఈసందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ... ఇంతటి దారుణమైన పరిస్థితి మధ్య మాట్లాడాలంటేనే బాధ అనిపిస్తుందని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్తీ మద్యం విక్రయాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తాడో లేదో కానీ, మద్యం షాపుల తాళాలు మాత్రం కరెక్ట్ గా ఆరింటికే తెరుస్తున్నారని మండిపడ్డారు. రాత్రి ఒంటిగంట, తెల్లవారుజాము మూడు గంటల వరకూ షాపులు తెరుస్తూ విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఫైరయ్యారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యం, మద్యాన్ని అమ్మిస్తున్నారని వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు విచ్చలవిడిగా మద్యం షాపుల నుంచి ప్రతినెలా వాటాలు వసూలు చేస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంత ఆదాయం, ప్రభుత్వ ఆదాయాన్ని టార్గెట్ చేసుకోవడం వల్లే ప్రజలు నష్టపోతున్నారన్నారు. 2014లో మద్యం అమ్మకాలు రూ.6,632 కోట్లు ఉంటే...ఈ ఏడాది కేవలం అక్టోబర్ వరకే రూ.7,050 కోట్లు దాటిందన్నారు. 7 నెలలకు రూ.7,050 కోట్ల చొప్పున ప్రతినెల వెయ్యి కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది చివరినాటికి రూ.12 వేల కోట్ల మద్యం ప్రజలచేత తాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఘోరమన్నారు.
తమ వారికే మద్యం తయారీ లైసెన్స్ లు ఇచ్చి చంద్రబాబు గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. సొసైటీలో ఆడవాళ్లు తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చదువుకునే పిల్లలను చంద్రబాబు బార్ షాపుల వైపు చూసే పరిస్థితికి తీసుకొచ్చారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. బెల్డ్ షాపులు తొలగిస్తామని సంతకం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బెల్ట్ షాపుల కోసం వేలం వేయడం దౌర్భాగ్యమన్నారు. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత గ్రామం పెద్దకర అగ్రహారంలోనే బెల్ట్ షాపులను వేలం వేసి అమ్ముతున్నారంటే పాలన ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు.
గుజరాత్లో మద్యం అమ్మకాలు లేకపోయినా నం.1 స్థానంలో ఉందని, బిహార్లో సంపూర్ణ మద్యనిషేధం విధించారని వైఎస్ జగన్ చెప్పారు. దాన్నుండి నేర్చుకోవాల్సిందిపోయి చంద్రబాబు విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వచ్చిన వెంటనే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు. ఇదే అంశంపై మద్యాన్ని నిషేధించే విధంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి, చెవులు పట్టుకొని గుంజిళ్లు తీసి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.